చిన్న చిన్న పాత్రలు, తర్వాత విలన్ వేషాలు వేస్తూ, చివరకు హీరోగా మారి తనదైన యాంగ్రీమేన్ తరహా పాత్రలలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఈయన సినిమాలలో యాంగ్రీమెన్‌గా కనిపిస్తాడు గానీ ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటాడు. తనకి డబ్బు సంపాదన బాగానే ఉందని, ఆ దేవుడి దయ, అందరి ఆశీర్వాదం వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పే ఆయన ఆర్.నారాయణమూర్తి నుంచి ప్రతి ఒక్కరు ఏ సాయం అడిగినా కాదనే వారు కాదు. ఈయన నిజానికి సినిమాలలోకి రాకముందు కాస్త జులాయిగా, సినిమా థియేటర్ల వద్ద కటౌట్లు కడుతూ, పూల మాలలు, థియేటర్ల వద్ద డెకరేషన్స్ చేస్తూ సినిమాలంటే ఎంత పిచ్చో నిరూపించుకున్నాడు. ఇక కాస్త సెటిల్‌మెంట్స్ వంటివి కూడా చేసేవాడని అంటారు. ఇక ఓ వ్యాంప్ నటిని, అందునా డిస్కోశాంతిగా పేరొందిన శాంతిని వివాహం చేసుకోవడం అంటే అదేమి చిన్న విషయం కాదు. సాధారణంగా తమకు తెలిసిన ఆడవారిని లోబరుచుకుని వాడుకుని వదిలేసే వారే తప్పితే ఓ వ్యాంప్ పాత్రధారిని వివాహం చేసుకుని తన పెద్దమనసు చూపడం అంత సులభం కాదు.
కానీ దానిని డిస్కోశాంతి విషయంలో శ్రీహరి నిజం చేశాడు. ఈమధ్య జయమాలిని కూడా మాట్లాడుతూ, శ్రీహరి వంటి మనసు అందరు నటులకు ఉండదని చెప్పింది. ఇక ఈయనది కూడా ఎంత సంపాదిస్తే అంత ఖర్చుపెట్టేరకం. తాను డ్రీమ్‌గా భావించే ఇంటిని నిర్మించడం, క్యారవాన్‌ని సొంతంగా కొనుగోలు చేయడం వంటివి ఆయనలోని డబ్బులు ఖర్చుచేసే విధానాన్ని తెలియజేస్తాయి. ఇక డిస్కోశాంతి కూడా శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత నటించడం మానివేసింది. తన భర్తని 'బావా.. బావా' అని పిలుస్తూ ఆమె చూపే ఆప్యాయతను దెబ్బతీస్తూ దేవుడు శ్రీహరిని ముందుగానే తన వద్దకు తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పటికీ కూడా ఆమె శాంతిగానే ఉంటూ, రెండో వివాహం వంటి వాటిని కూడా మనసులోకి రానివ్వడం లేదు. తన కుమారులే లోకంగా బతుకుతోంది. ఈమె శ్రీహరి మరణించిన చాలా కాలం తీవ్ర డిప్రెషన్‌కి లోనైంది.
తాజాగా ఆమె మాట్లాడుతూ, పెళ్లయ్యే నాటికి నాకు వంటరాదు. పప్పు, అరటికాయ కూర, ఆలూకూర మాత్రమే చేయడం వచ్చు. దాంతో నేను ప్రతిరోజు వంట చేసేటప్పుడు చెన్నైలో ఉన్న మా అమ్మకి ఫోన్ చేసి ఆమెని అడుగుతూ వంటి చేసేదానిని. ఇలా ఆరు నెలల పాటు చేశాను. నాడు కేవలం ల్యాండ్‌లైన్లే ఉండేది. దాంతో బిల్లు రెండు లక్షల ఎనబై ఐదు వేల రూపాయలు వచ్చింది. అది చూసి శ్రీహరి గారు షాక్ అయ్యారు. నువ్వు వంట చేయడం మానేయి. హోటల్ నుంచి తెచ్చుకుంటాను. హోటల్ నుంచి తెచ్చుకున్నా ఇందులో సగం కూడా ఖర్చు కాదు అని అన్నాడని చెప్పుకొచ్చింది.