రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయునిగా పుట్టడం మన దేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఎంతో దూరదృష్టితో మన రాజ్యాంగానికి రూపకల్పన చేయడంతో పాటు ఆయన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశారు. ఆయన జయంతి సందర్భంగా నాతరపున, నా పార్టీ తరపున ఆయనకు ఘనమైన అంజలి ఘటిస్తున్నాను అని తెలిపాడు. ఇక ఈయన ఈరోజు తన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి గడపనున్నాడు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కి హాజరవుతారు.
కాగా ఇటీవల హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు పవన్‌ని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోటీ నిర్వాహకులను, ఆటగాళ్లను పవన్ ని అభినందించి ఈ పోటీలకు తన వంతుగా ఐదు లక్షల రూపాయలను కూడా డొనేట్ చేశాడు. ఇక పవన్ చెప్పినట్లు అంబేద్కర్ వంటి మహనీయుడు మనదేశంలో పుట్టడం మన అదృష్టం. అదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగంలో దళిత, బలహీన, బడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటికి కాల పరిమితిని సూచించి, వాటినే పెంచుకుంటూ పోతే ఎన్ని అనర్థాలు వస్తాయో కూడా చెప్పాడు.
ఇక ఈయన దేశంలో దక్షిణాది, ఉత్తరాది మధ్య ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే ముందుగా ఊహించి హైదరాబాద్‌ని సెకండ్ క్యాపిటల్ చేయాలని కోరుకున్నాడు. కానీ వాటిని నేటి రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ, నిజంగా అంబేద్కర్ చెప్పిన విషయాలను విస్మరిస్తున్నారు. దాంతోనే ఆయన ముందుగా ఊహించినట్లుగా ఉత్తరాది పెత్తనం, అగ్రవర్ణాల పేదలలో రిజర్వేషన్లపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటం గమనించవచ్చు.