శ్రీరెడ్డి లీక్స్ విషయంలో ఆమె ఇష్టపడి చేసిందా? లేదా చాన్స్‌ల కోసం అలా చేసిందా? లేక చీప్ పబ్లిసిటీ కోసం అలా మాట్లాడుతోందా? అనే విషయంలో పలువురు మొదట్లో అనుమాన పడ్డారు. ఇక శ్రీరెడ్డి అర్దనగ్నంగా ఫిల్మ్‌చాంబర్ వద్ద ప్రదర్శన చేయడం, దాంతో మా అసోసియేషన్‌కి కోపం వచ్చి, 'మా' అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరెడ్డికి 'మా' సభ్యత్వమే ఇచ్చేది లేదని, ఆమె పక్కన ఎవరైనా నటిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని చెప్పాడు. దీంతో అసలు సమస్య కాస్తా పక్కదారి మళ్లింది. పలువురు ఇలా 'మా'లో నియంతృత్వ పోకడలపై ధ్వజమెత్తారు. తమ్మారెడ్డి భరద్వాజతో పాటు మీడియా, కత్తి మహేష్, అపూర్వ వంటి వారందరూ దీనిపై మండిపడ్డారు. అయినా చేసిన ఆరోపణలపై విచారణ చేసి పరిస్థితి చక్కదిద్దాల్సింది పోయి ఏకంగా శ్రీరెడ్డికి మా అసోసియేషన్ సభ్యత్వం ఇవ్వమనే సరికి శ్రీరెడ్డి కూడా ఇక తనతో ఫొటోలు దిగిన సురేష్‌బాబు చిన్నకుమారుడు అభిరామ్, నిర్మాత, రైటర్ కోనవెంకట్‌ల పేర్లు చెప్పి, అభిరామ్ తనతో దిగిన ఫొటోలను కూడా చూపడంతో ఇక పెద్దల గుండెల్లో భయం గుబులు పట్టుకుంది.
ఇక 'మా'పై తీవ్ర విమర్శలు వస్తూ, ఈ విషయంలో నేషనల్ మీడియాను కూడా కదిలించడంతో చేతులు కాలాక శివాజీరాజా 'మా' నుంచి శ్రీరెడ్డిని బహిష్కరించడం లేదని, అందరికీ ఇచ్చినట్లే ఆమెకి కూడా సభ్యత్వం ఇస్తామని చెప్పాడు. ఇక 'మా' నియంత పోకడలు ఇప్పుడు బయటికి వచ్చాయి గానీ నాగార్జున, మోహన్‌బాబులు పనిచేసేటప్పుడు కూడా 'మా' ఇలాగే బిహేవ్ చేసింది. 'మా'లో సభ్యత్వం లేని వారిని హీరోయిన్లుగా కూడా అవకాశం ఇవ్వరాదని చెప్పిన మోహన్‌బాబు తన సొంత కుమారులే మాలో సభ్యత్వం లేనివారితో నటించారు. ఇక ప్రత్యూష హత్యకేసులో మా అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని, ఓ సినీ పత్రిక ఎడిటర్ ప్రశ్నిస్తే, ఆయనపై, ఆయన పత్రికపై నాగ్ నిషేదం విధించాడు. ఇక తాజాగా శివాజీరాజా మాట్లాడుతూ, అభిరామ్ నటుడు కాదు.. నిర్మాత కాదు.. కాబట్టి ఆ విషయంలో మేము ఏమీ చేయలేం. ఇక కోనవెంకట్ సంగతి కూడా రైటర్స్ అసోసియేషన్ చూసుకుంటుందని చెప్పాడు. అయితే కోన వెంకట్ నిర్మాత కూడా అన్నవిషయం శివాజీరాజా మర్చిపోయాడు.
ఇక తాజా ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరడంతో శివాజీరాజాకి కోపం వచ్చింది. ముందు నువ్వు మెల్లిగా మాట్లాడు.. మెల్లిగా మాట్లాడూ.. అంటూ ఆగ్రహించాడు. పక్కనే ఉన్న నరేష్ కోపం వద్దు అని శివాజీరాజాని అదుపు చేయడానికి ప్రయత్నించడం చూస్తే 'మా' అధ్యక్షునికే సంయమనం లేనప్పుడు.. బాధితులకు, ఎవరి అండా లేని వారికి అసహనం ఎందుకు రాదు..? రాకూడదు? అనేదే అసలు ప్రశ్న.