సెన్సార్ విధానం రోజు రోజుకి పలు వింత పోకడలు పోతోంది. వారికి ఏ సీన్‌లో అభ్యంతరాలు కనిపిస్తాయో, ఏ సన్నివేశాలు ఎందుకు నచ్చుతాయో కూడా తెలియదు. నిజంగా మన ఎన్నో ఏళ్లు ముందుకు వచ్చాం. నేటి సాంకేతికతో మనం ఎంతో ముందున్నాం అని చెప్పుకుంటున్నామే గానీ మనకంటే మన పూర్వీకులకే ఎక్కువ స్వేచ్చ, సామాజిక బాధ్యత ఉందనేది వాస్తవం. ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోకడలు మరింతగా ఎక్కువయ్యాయి. తానో నియంతలా భావిస్తూ మోదీ ప్రవర్తిస్తుంటే.. యథా రాజా.. తధా అధికారి అన్నట్లుగా మన అధికారులు కూడా ప్రభుత్వాలకు గులాం కొడుతున్నారు. ఎప్పుడో టిఎన్ శేషన్, జెడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్‌నారాయణ్ వంటి అరుదైన అధికారులు మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. అలాంటి వారు కూడా ఒత్తిళ్లకు తలొగ్గలేక, తమ మనస్సాక్షిని చంపుకోలేక పదవులు వదిలి వెళ్లిపోతున్నారు.
ఇక ఈమద్య వచ్చిన విజయ్ తమిళ చిత్రం 'మెర్సల్' చిత్రంలో జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, డాక్టర్లపై వేసిన సెటైర్లు ఏ స్థాయిలో ప్రజల్లో చైతన్యం తెచ్చాయో తెలిసిందే. నిజంగా నేడున్న సెన్సార్ విధానం, ప్రేక్షకుల మైండ్ సెట్‌కి 'మాలపిల్ల, కన్యాశుల్కం, చింతామణి' వంటివి కూడా బూతుగానే కనిపిస్తాయని చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే గత 30ఏళ్లుగా కష్టాలు, నష్టాలు, ఆర్దిక ఇబ్బందులను తట్టుకుని బడా బడా నిర్మాతలే ఒక చిత్రం ఫ్లాప్ అయితే మూటాముల్లె సర్దుకుంటున్న రోజుల్లో పీపుల్స్‌స్టార్‌గా అవతరించిన ఆర్.నారాయణ మూర్తి పీడిత, బడుగు, రైతులు, సారా ఉద్యమం నుంచి ఎన్నో సామాజిక చైతన్యవంతమైన చిత్రాలు తీస్తూనే ఉన్నారు. ఆయనంటూ తనరూట్‌ని ఎప్పుడు మార్చలేదు.
ఇక తాజాగా ఆయన నటించి, నిర్మించిన 'అన్నదాత సుఖీభవ' చిత్రంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి విషయాలను ప్రస్తావించాడట. వాటిని తొలగించాలని సెన్సార్ కోరడంతో ఈయన కూడా అనవసరంగా ఇబ్బందులు ఎందుకు అని వాటిని తొలగించడానికి ఓకే చెప్పాడు. కానీ ఈ చిత్రంలోని మెయిన్‌పాయింట్ అయిన బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయలు రుణం ఇచ్చివారు ఎగ్గొడితే శిక్షలు వేయరు. రైతుకి మాత్రం చిన్నమొత్తాలకే పీడిస్తున్నారు.. అనే మెయిన్ పాయింట్‌నే సెన్సార్‌వారు తీసేయమనడంతో అసలు కథా వస్తువు అదే అయినప్పుడు ఎలా తీసేస్తామని ఆర్.నారాయణమూర్తి ద్వజమెత్తారు.
బడా పారిశ్రామికవేత్తలు చేసిన పుణ్యం ఏమిటి? రైతులు చేసిన పాపం ఏమిటి? కోట్లాది రూపాయలను మోసం చేసి ఎందరో తప్పించుకుని పోతున్నారు. రైతులను ఆదుకోవాలని సీన్లు తీయడం తప్పా? కోట్లాది మంది భారతీయులు పన్నులు కడుతోంది బడా పారిశ్రామికవేత్తలకు ధారాధత్తం చేయడానికా? అంటూ ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అంబేద్కర్ జయంతి నాడు చిత్రాన్ని విడుదల చేయాలని భావించానని, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన స్వేచ్చని ఇలా కాలరాస్తారా? ఇదే విషయంపై పత్రికల్లో, మీడియాపై విస్తృతమైన చర్చ సాగుతోంది. మరి దానిని నేను నా చిత్రంలో చూపించడంలో తప్పేముంది? అందుకే ఈ చిత్రం విషయంలో పునర్విచారణ కమిటీ వరకు వెళతానని పీపుల్స్‌స్టార్ స్పష్టం చేశాడు.