బయోపిక్‌లు తీయడం సామాన్యమైన పనికాదు. దానికి బాలీవుడ్ మేకర్స్ మాత్రమే ఎక్స్‌పర్ట్స్. తెలుగు విషయానికి వస్తే ఒకరి జీవితంలో జరిగిన అన్నిరకాలైన వివాదాలు, సంచలనాలు చూపించే స్థాయికి మన మేకర్స్, వాటిని అంగీకరించే స్థాయికి మన ప్రేక్షకులు ఇంకా ఎదగలేదు. ఇక ప్రస్తుతం తెలుగులో కూడా బయోపిక్స్ హవా నడుస్తోంది. మహానటి సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' అనే చిత్రం మే 9న విడుదల కానుంది. ఇక బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో తన తండ్రి పాత్రను తానే చేస్తూ తేజ దర్శకత్వంలో ఓ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తీయనున్నాడు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ అంటే అందులో ఎన్టీఆర్‌తో ముడిపడిన పలువురు సినీనటులు, రాజకీయ నాయకులకు కూడా స్థానం కల్పించాలి. కానీ బహుశా నిడివి సమస్య కారణంగా వీరందరినీ పూర్తి పాత్రలుగా కాకుండా, కామియో పాత్రలుగా రూపుదిద్దుతున్నారని తెలుస్తోంది. కృష్ణ పాత్రకి మహేష్, చంద్రబాబు నాయుడు పాత్రకి రాజశేఖర్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకు దీపికాపడుకొనేని సంప్రదిస్తున్నారు. మరో వైపు ఎన్టీఆర్ శ్రీమతి పాత్రకి విద్యాబాలన్ పేరు వినిపిస్తోంది. ఇక ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ మనవడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, పెద్దకుమారుడు హరికృష్ణ తప్పించి మిగిలిన కళ్యాణ్‌రామ్, తారకరత్న వంటి వారికి కూడా పాత్రలు ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ సినీ జీవితంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత పాత్ర కూడా ఉంటుంది. ఎన్టీఆర్, జయలలితలు కలసి పలు చిత్రాలలో నటించారు. ఇక ఎమ్జీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత జయలలితలు కూడా ముఖ్యమంత్రులయ్యారు. దీనితో ఈ చిత్రంలో జయలలిత పాత్రకు చందమామ కాజల్‌ని తీసుకున్నారని సమాచారం. తేజకి కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యం మీద ఆమె కూడా చిన్న పాత్రే అయినా, కీలకమైన పాత్ర కావడం, విజువల్ వండర్‌గా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కావడంలో కాజల్ కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.