నాడు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి హీరోలు విజయవిహారం చేస్తున్నరోజుల్లో జానపద, సాంఘిక చిత్రాల ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరసింహరాజు. ఈయన పక్కన్న చిరంజీవి సైతం చిన్నరోల్స్, విలన్ పాత్రలు చేశాడు. ఇక ఈయనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఇంట్లో చెబితే వద్దంటారని, మద్రాస్ ట్రైన్ ఎక్కి మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌లో దిగి పలు ఇబ్బందులు పడుతూ, కష్టాలు అనుభవించాడు. ఆ సమయంలో ఆయనకి 'నీడలేని ఆడది' అనే చిత్రంలో అవకాశం రావడం, ఆ చిత్రం హిట్ కావడంతో ఈయన బిజీ అయ్యాడు. ముఖ్యంగా విఠలాచార్య.. కత్తికాంతారావు తర్వాత నరసింహరాజుకే ఎక్కువగా హీరోగా అవకాశాలు ఇచ్చేవాడు. అలా నాడు ఎన్టీఆర్, ఏయన్నార్‌ల తర్వాత మంచి పేరు తెచ్చుకున్న నటునిగా నరసింహరాజుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
నాడు గోదావరి జిల్లాలలో, దివిసీమ తుపాన్ నేపధ్యంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో సహా సినిమా నటులు ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. దానిపై నాడు నరసింహరాజు ఇలా జనాల నుంచి విరాళాలు తీసుకోకుండా తామే తమ పారితోషికంతో ఆ విరాళాలు ఇవ్వవచ్చు కదా..! అన్నాడని, దాంతో ఎన్టీఆర్, ఏయన్నార్‌లకు కోపం వచ్చిన కారణంగా ఆయన సినిమా జీవితం అర్ధాంతరంగా పడిపోయిందని నాటి మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై నరసింహరాజు స్పందిస్తూ, నేను అన్నది ఒకటి. ప్రచారం మాత్రం మరోవిధంగా జరిగింది. అప్పుడు నేను చాలా కుర్రాడిని, ముక్కుసూటిగా మాట్లాడే వాడిని. లౌక్యం ఉండేది కాదు.. దాంతో నేను పలు షోలు ఇస్తూ నెలరోజులకు పైగా విరాళాలు సేకరించే బదులు నటీనటులందరూ ఓ చిత్రంలో నటించి, ఆ చిత్రం లాభాలను, వారి పారితోషికాన్ని బాధితులకు ఇవ్వవచ్చు కదా..! అన్నాను అని చెప్పుకొచ్చాడు.
ఇక మీ కెరీర్‌లో ఎప్పుడైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్నకు, నాడే కాదు.. నేటికి కూడా నా పరిస్థితి ఆర్దికంగా బాగా లేదు. మా నాన్న గారికి చాలా భక్తి, మా ఊరికి వచ్చే స్వాములను, వారి శిష్యులను పిలిచి భోజనాలు పెట్టేవారు. అలా రోజుకి 60, 70 మంది మా ఇంట్లో భోజనం చేసేవారు. దాంతో మాకున్న 70ఎకరాల భూమిని మా నాన్న అమ్మేశాడు. నాడు ఎకరం విలువ తొమ్మిదిపది వేలు ఉండగా, అవి ఇప్పుడు 80, 90లక్షలుఉంది. అయినా ఆస్తులు పోగొట్టుకున్నా కూడా ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం ఆనందంగా ఉంది.. అనిచెప్పుకొచ్చాడు.