బాలీవుడ్, కోలీవుడ్ వంటి చోట సినిమా విడుదలై హిట్టయిన తర్వాత ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకోవడం ఎప్పటి నుంచో వస్తోంది. ఇక రజనీ, ధనుష్, రాఘవలారెన్స్, శింబు, అజిత్ వంటి వారు సినిమా పూర్తి అయిన వెంటనే యూనిట్ మొత్తాన్ని పిలిచి భోజనం పెట్టి, వారికి గిఫ్ట్‌లు ఇస్తారు. ఇప్పుడు అదే రూట్‌ని సూపర్‌స్టార్ మహేష్‌బాబు పాటిస్తున్నాడు. ఈయన నటించిన 'భరత్ అనే నేను' చిత్రం ఈనెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం మహేష్ కెరీర్‌కి ఎంతో కీలకం. 'బ్రహ్మూెత్సవం, స్పైడర్' చిత్రాల డిజాస్టర్స్ నేపధ్యంలో 'భరత్ అనే నేను'పై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈమధ్య తెలుగులో రాజకీయ వేడి ఊపందుకుంది. ఆ నేపధ్యంలో వచ్చే చిత్రాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో అందమైన సీఎంగానే కాకుండా, డైనమిక్ సీఎంగా కూడా మహేష్ కనిపించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రం పాటలు, ట్రైలర్ తర్వాత హడావుడి మామూలుగా లేదు. అందునా 'శ్రీమంతుడు' అనే బ్లాక్‌బస్టర్ తర్వాత కొరటాల శివ-మహేష్‌లు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం మరో విశేషం.
ఇక ఈ చిత్రంపై మహేష్‌కి ఎంత నమ్మకం ఉందో ఆయన తాజాగా చేసిన పని వల్ల అర్థమవుతోంది. తెలుగులో కూడా బండ్లగణేష్, పూరీజగన్నాథ్‌తో పాటు తన చిత్రం తీసిన ప్రతి దర్శకునికి సినిమా విడుదలైన తర్వాత మంచి గిఫ్ట్‌లు ఇస్తాడు. ఇక ఇదే రూట్‌ని ఫాలో అయిన మహేష్ 'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కొరటాల శివకు చాలా ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. ఇక తాజాగా 'భరత్ అనే నేను' చిత్రం విడుదల కాకముందే, మరో 10రోజుల దాకా సమయం ఉండగానే ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందనే నమ్మకంతో మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌లు ఈ చిత్రం డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన వారి కృషి, కష్టం గమనించి, ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వారిని పిలిచి యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ని బహుమతిగా ఇవ్వడం చూస్తుంటే మహేష్ కేవలం దర్శకనిర్మాతలు, నటీనటులు, ప్రధానమైన సాంకేతిక నిపుణులనే కాదు.. అందులో పనిచేసే ఇతర అసిస్టెంట్స్ వారిని కూడా గుర్తు పెట్టుకుని గిఫ్ట్‌లు ఇవ్వడం మహేష్‌కి 'భరత్ అనే నేను'పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.