1980 పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా రంగస్థలం అనే ఊరిలో చూపించిన దర్శకుడు సుకుమార్ ఆ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నాడనే ప్రచారం బాగా జరిగింది. సినిమా విడుదలకు ముందు మరీ ముప్పై నలభై యేళ్ళనాటి వాతావరణాన్ని సుకుమార్ ఎలా చూపిస్తాడు... అసలు అప్పటి పరిస్థితులకు ఇప్పటి మోడ్రెన్ యుగంలో ఉన్నవారు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనే అనుమానం ఉండేది. కానీ సినిమా విడుదలయ్యాక మాస్, అండ్ క్లాస్ ఆడియన్స్ ని ఓవరాల్ గా పడగొట్టేసింది రంగస్థలం. అయితే ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన సుకుమార్ ఈ సినిమాకి పారితోషికమే తీసుకోలేదట. కేవలం సినిమా మొదలవ్వడానికి మైత్రి వారు సుకుమార్ కి ఇచ్చిన అడ్వాన్స్ తప్ప... సుకుమార్ మరే రకంగానూ డబ్బు రూపంలో అందుకోలేదట.
అయితే పారితోషికం కింద రంగస్థలం ఓవర్సీస్ హక్కులు మాత్రం అడిగాడట. ఎందుకంటే సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంటుంది. ఆయన సినిమాలు ఇక్కడ యావరేజ్ అయినా ఓవర్సీస్ లో హిట్. ఇక రామ్ చరణ్ కి ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ లేకపోవడంతో రంగస్థలం సినిమా హక్కులకు అక్కడ నుండి పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదట. సినిమా షూటింగ్ మధ్యలో తొమ్మిది కోట్ల ఆఫర్ ఇచ్చిన వారు కూడా.. అక్కడ పెద్ద సినిమాలు వరుసగా బోల్తా పడడంతో... వెనక్కి తగ్గారట. ఇక ఎలాగూ సుకుమార్ పారితోషికం కింద ఓవర్సీస్ హక్కులు అడగడంతో నిర్మాతలు కూడా మారు మాట్లాడకుండా ఆ హక్కులు సుకుమార్ కి ఇచ్చేశారట. అయితే రంగస్థలం అక్కడ మహా అయితే రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ యుఎస్ నుంచి వస్తుందని అనుకున్నారట. కానీ ఈ చిత్రం ఫుల్ రన్‌లో మూడున్నర మిలియన్ల గ్రాస్ వసూళ్లని యుఎస్‌లో సాధించేందుకు పరుగులు పెడుతోంది.
ఇక అమెరికాలోనే రంగస్థలం చిత్రం షేర్ పన్నెండు కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. అలాగే అరబ్ దేశాలు, యుకె, ఆస్ట్రేలియాలోను అదరగొట్టిన ఈ చిత్రానికి రెండు కోట్ల వరకు అవుట్ రైట్ బిజినెస్ జరిగింది. అలా ఓవర్సీస్ లో సుకుమార్ ఎలా లేదన్న 14 నుండి 15 కోట్లు దండుకుంటాడన్నమాట. అలా పారితోషికాన్ని తీసుకున్న సుకుమార్ ని ఇప్పుడు చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చేసి బుక్ చేసేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. కానీ సుకుమార్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా మైత్రి మూవీస్ లోనే చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు.