ఈమధ్యకాలంలో కేవలం 'టెంపర్' తప్ప గత పది పదకొండు చిత్రాలుగా పూరీ జగన్నాథ్ రేంజ్‌కి తగ్గ చిత్రం రాలేదనే చెప్పాలి. బాలయ్య వంటి మాస్ హీరో పిలిచి మరీ 'పైసావసూల్' వంటి క్రేజీ ప్రాజెక్ట్‌ని ఇస్తే దానిని కూడా మూసధోరణిలో తీసి తనలో గుజ్జు అయిపోయిందేమో అనిపించాడు. ఇక ఆయన ఇప్పుడు తన కుమారుడు ఆకాష్ పూరిని పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేయనుండటంతో పలువురిలో అనుమానాలు మొలకెత్తాయి. తన సోదరుడు సాయిరాం శంకర్ తరహాలోనే పూరీ తన కుమారుడి కెరీర్‌ని కూడా దెబ్బతీస్తాడేమో అనే అనుమానాలు వచ్చాయి. ఇక ఈ చిత్రం ద్వారా ఆకాష్ పూరినే కాదు... నేహాశెట్టి అనే కొత్త హీరోయిన్‌ని కూడా పూరీ పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ కూడా 'మెహబూబా' అని పెట్టడంతో పాటు ఇది ఇండోపాక్ యుద్దం సమయంలో అంటే 1972కాలంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరీ అని అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రం టీజర్ బాగా అలరించడంతో తాజాగా విడుదల చేసిన ట్రైలర్ పట్ల ఆసక్తి పెరిగిపోయింది.
ఇందులో పూరీ మార్క్ డైలాగ్స్, ఇండోపాక్ ఆర్మీ నీడలో జరిగే సన్నివేశాలు, యుద్ద సీన్స్, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు, మధ్యలో హిందు ముస్లిం ప్రేమకథ ఇలా ఈ ట్రైలర్ సాగింది. సందీప్ చౌతా సంగీతం, జానీ షేక్ అందించిన ఆర్ట్, విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ వంటి వన్నీ అదిరిపోయాయి. ఇక పూరీ కనెక్ట్స్ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన రెండు గంటల్లోనే 5లక్షల వ్యూస్‌ని సాధించింది. దాంతో పూరీ కనెక్ట్స్‌లో ఒకరైన చార్మి దీని గురించి ఆనందంతో ట్వీట్ చేసింది. రెండు గంటల్లో ఐదు లక్షల వ్యూస్ తెచ్చుకున్న విషయాన్ని పోస్టర్ మీదరాసి, మాటలు లేవు. ఆనందభాష్పాలే అని ట్వీట్ చేసింది. దేశాన్ని ప్రేమించే మనసు సైనికుడికి మాత్రమే ఉంటుంది. ఆ మనసులో చిన్నపాటి స్థానం దొరికినా చాలు. మమ్మల్ని చంపేస్తే మరలా పుడతాం...అనే డైలాగ్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి 'పైసావసూల్' సమయంలో కూడా స్టంపర్ అంటూ, ట్రైలర్ అంటూ తెగ ప్రచారం చేసినా, సినిమా వరకు వచ్చేసరికి బెడిసి కొట్టింది. మరి ఈసారి పూరీ నిజంగా మేజిక్ చేస్తాడో లేదో మే 11న సినిమా రిలీజ్ అయ్యే వరకు నమ్మకంగా చెప్పలేం.