భాషా బేధాలు లేకుండా అన్ని భాషా ప్రేక్షకుల గుర్తింపు పొందడం సులువేమీ కాదు. ఇక మన భాషల్లో స్టార్స్ అయిన వారు కూడా మిగతా భాషల వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇండియాలోని అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు మాధవన్. ఈయన తన పాత్ర నిడివిని చూడడు. పాత్ర తనకి నచ్చిందంటే చిన్నాపెద్దా తేడా లేకుండా చిత్రాలలో నటిస్తాడు. ఇక ఈయన పెట్టే మరో కండీషన్ ఏమిటంటే.. ఈయనకు బాగా తెలిసిన భాషల్లోనే నటిస్తాడు. భాష, డైలాగ్స్ అర్ధం కాకపోతే నటించడం ఇష్టం లేదంటాడు. దాంతో ఆయనకు తెలుగు కూడా బాగా రాకపోవడంతో తెలుగు చిత్రాలలో మాత్రం స్ట్రయిట్‌గా నటించలేదు. కేవలం కోలీవుడ్, బాలీవుడ్‌లలో మాత్రమే నటిస్తున్నాడు. ఇక ఈయన చివరి చిత్రం 'విక్రమ్‌వేద' తమిళంలో సంచలనం సృష్టించింది. దానికి ముందు 'సాలా ఖద్దూస్' కూడా అంతే. అలాంటి మాధవన్ తొలిసారిగా తనకు భాష రాకపోయినా కూడా తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న 'సవ్యసాచి' అనే చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈయన కొంతకాలంగా బెడ్‌రెస్ట్ తీసుకుంటున్నాడు. గాయం కావడంతో ఆయన రెస్ట్‌మూడ్‌లో ఉన్నాడు. దీంతో ఆయన చేత 'అర్జున్‌రెడ్డి' బాలీవుడ్ రీమేక్‌ని చేయాలని భావించిన నిర్మాతలు షాహిద్ కపూర్ వైపు చూస్తున్నారు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మాధవన్ పుత్రోత్సాహంలో ఉన్నాడు. ఈయన కుమారుడు వేదాంత్ మాధవ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించి, భారతదేశం గర్వించేలా చేశాడు. థాయ్‌లాండ్‌లో వేదాంత్ గెలిచినప్పటికీ అందరు ఆయన ఎవరో అనుకున్నారు. కానీ మాధవన్ తనయుడు అని తెలుసుకుని నెటిజన్లు మాధవన్, ఆయన కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వేదాంత్ మాధవన్-సరిత దంపతులు కుమారుడు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ, నాతో పాటు నా భార్య సరిత కూడా సంతోషించాల్సిన విషయం ఇది. నా కుమారుడు వేదాంత్ ధాయ్‌లాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో దేశానికి కాంస్య పతకం అందించినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని తన సంతోషం వెలిబుచ్చాడు. దీంతో పాటు వేదాంత్ కాంస్య పతకం అందుకున్న ఫొటోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మొత్తానికి ఈ విలక్షణ నటుడి కుమారుడు సినిమాల వైపు చూడకుండా ఆటలపై శ్రద్ద పెట్టడం విశేషమనే చెప్పాలి.