వరుసగా 'బ్రహ్మోత్సవం, స్పైడర్' వంటి డిజాస్టర్స్ అందించి మహేష్ తన ఫ్యాన్స్‌ని, సినీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా మాత్రం ఆయన ఈనెల 20న విడుదల కానున్న 'భరత్ అనే నేను' ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈయన తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో తన అభిమానులనే కాదు.. ఎన్టీఆర్ అభిమానులను కూడా ఆకట్టుకున్నాడు. ఈ వేడుక ముగిసిన తర్వాత మహేష్‌బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. రాత్రి వేడుకకి హాజరైన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. అక్కడ మిమ్మల్ని చూడటం ఎంతో అందమైన అనుభూతి. గత కొన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తున్న, కురిపిస్తున్న ప్రేమకి చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం కేవలం మీరేనని రాత్రి జరిగిన వేడుకలో మిమ్మల్ని చూసిన తర్వాత మరోసారి నాకు అర్ధమైంది. 'భరత్ అనే నేను' బహిరంగ సభను విజయవంతం చేసిన అందరికీ థ్యాంక్స్. ఈనెల 20న థియేటర్లలో కలుసుకుందాం. మీరందరూ ఈ చిత్రం చూసి గర్వపడేలా చేస్తాను అని ప్రకటించాడు.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, కథ నచ్చిందంటే మహేష్ ప్రాణాలను కూడా పణంగా పెట్టేస్తాడు. నాడు 'శ్రీమంతుడు' లో అదే జరిగింది. ఇప్పుడు 'భరత్ అనే నేను'లో అదే జరుగుతోంది. ఈ చిత్రం కథను నేను ఐదు గంటల పాటు మహేష్‌కి నెరేట్ చేశాను. ఫస్ట్‌హాఫ్ రెండున్నర గంటలు, సెకండాఫ్ రెండున్నర గంటలు చెప్పాను. మరి ఐదు గంటలు నెరేట్ చేస్తే మహేష్ ఏమైనా ఇబ్బంది పడతాడేమోనని అనుకున్నాను. కానీ ఆయన ఈ చిత్రం ఐదు గంటలు ఉంటే బాగుంటుంది అన్నారు. ఇక దానయ్య గారు ఎప్పటి నుంచో రిచ్ అండ్ గ్రాండ్ మూవీ కావాలని అడుగుతున్నారు. అది 'భరత్ అనే నేను'తో తీర్చేశాను. ఇక ఇందులో మహేష్‌ని అందమైన ముఖ్యమంత్రి గానే కాదు.. డైనమిక్ సీఎంగా చూపిస్తున్నాను. ఇందులో హీరోయిన్‌ది కూడా కీలక పాత్ర. అందుకే 'ధోని' చూసి ఏరికోరి కైరా అద్వానీని తెచ్చాను అని చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ లుంగీ కట్టిన 'పోకిరి, శ్రీమంతుడు' వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయని, 'భరత్ అనే నేను' లో కూడా మహేష్ లుంగీ కట్టడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని ఆయన అభిమానులు అంటుంటే...యాంటీ ఫ్యాన్స్ మాత్రం 'సామీ' అనే పదం వచ్చిన 'ఖలేజా' ఫ్లాప్ అయిందని, 'భరత్ అనే నేను'లో కూడా 'సామీ' అనడం ఏమిటని సెటైర్లు వేస్తున్నారు.