మిర్చి లో ప్రభాస్ ఫ్యాక్షనిజాన్ని పగతో కాదు ప్రేమతో అంతం చేసే విధానాన్ని ఎంతో చక్కగా చూపించిన కొరటాల శివ... శ్రీమంతుడు సినిమాలో ఒక ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ మీద ఆ ఊరి బాగు కోసం.. ఉన్నత కుటుంబం నుండి వచ్చిన మహేష్ బాబు ఎలాంటి కష్టాలు పడి... ఆ ఊరిని బాగుచేశాడో అనేది అందంగా తీర్చిదిద్ది... జనతా గ్యారేజ్ లో ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ ని చూపించడమే కాదు సమాజానికి మంచి జరగడం కోసం చెడ్డవారిని దండించొచ్చు అని చూపించడంతో... కొరటాల తన ప్రతి సినిమాలో ఏదో ఒక విధంగా సమాజానికి మేలు చేసే కాన్సెప్ట్ మీదే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మరి మహేష్ బాబుతో రెండోసారి 'భరత్ అనే నేను' లో కూడా రాజకీయాలను ప్రక్షాళన చేసి రాజకీయ నేతలను మాటమీద నిలబడే మగాళ్ళలా మారుస్తానంటూ మహేష్ చేతే చెప్పించిన డైలాగ్స్ సినిమా మీద అంచనాలు, క్రేజ్ అన్ని పెంచేశాయి.
అందులోను భరత్ ట్రైలర్ చూడగానే సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోవడమే కాదు భరత్ అనే నేను సినిమా సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోకొచ్చేసింది. నిన్నటి వరకు సోషల్ మీడియాలో రామ్ చరణ్ రంగస్థలం ముచ్చట్లు హల్చల్ చేస్తే... నేడు భరత్ అనే నేను సినిమా ముచ్చట్లు హల్చల్ చేస్తున్నాయి. ట్రైలర్, మేకింగ్ వీడియోలతో రచ్చ మొదలెట్టిన భరత్ లో కొరటాల రాజకీయాల మీద ఫోకస్ చెయ్యడమే కాదు... ఈ సినిమాలో అసెంబ్లీ సన్నివేశాలను ఓ రేంజ్ లో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సన్నివేశాలు భరత్ అనే నేను లో దాదాపుగా 15 నిమిషాలకు పైగానే ఉంటాయని... ఈ సన్నివేశాలే భరత్ అనే నేను సినిమాకి మెయిన్ హైలెట్ అంటున్నారు.
ఇక కొరటాల అండ్ బ్యాచ్ అసెంబ్లీ సెట్ కోసం పెట్టిన ఖర్చు వృధాగా పోదని... అక్కడ తెరకెక్కించిన సినిమా సీన్స్ అదరహో అనే రేంజ్ లో వచ్చాయట. అలాగే కీలకమైన కొన్ని సన్నివేశాలన్నీ సెకండ్ హాఫ్ లో ఉండబోతున్నాయని టాక్. ఇక సినిమా ఎంత స్టైలిష్ గా తెరకెక్కించినా యాక్షన్ సన్నివేశాలకు కూడా కొదవ ఉండదనే టాక్ వినబడుతుంది. మరి మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే భరత్ అనే నేను లో మహేష్ -- కైరా అద్వానీల రొమాంటిక్ ట్రాక్ కూడా సూపర్బ్ గా వచ్చిందట.