ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మూవీతో మల్టీస్టారర్స్, నిజమైన అరుదైన కాంబినేషన్స్, ఒకే జనరేషన్‌కి చెందిన ఇద్దరు స్టార్స్ నటించే సంప్రదాయానికి రాజమౌళి తెరతీశాడు. ఇక తాజాగా మహేష్‌బాబు నటించిన కొరటాల శివ చిత్రం 'భరత్ అనేనేను' చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం. అయినా రామ్‌చరణ్ కూడా హాజరయి ఉంటే మరింత కనుల పండువగా ఉండి ఉండేది. ఇక ఈ చిత్రం వేడుకలో మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లు పక్క పక్కన కూర్చోవడం చూసి నటుడు బ్రహ్మాజీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఎన్టీఆర్, కృష్ణలకు తమకెరీర్ పీక్ స్టేజీలో పలు స్పర్ధలు వచ్చాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కృష్ణ తాను ఎంపీగా గెలిచి, ఎన్టీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలైన చిత్రాలను తీశాడు. ఇక ఎన్టీఆర్ చేయాలనుకున్న 'అల్లూరి సీతారామరాజు'ని కృష్ణ చేయడం, ఎన్టీఆర్ 'దాన వీరశూర కర్ణ'కి పోటీగా కృష్ణ 'కురుక్షేత్రం' తీయడం తెలిసిందే. అయినా కూడా కృష్ణ నిర్మించి, నటించిన 'దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు' వంటి చిత్రాలలో ఎన్టీఆర్, కృష్ణలు కలసి నటించారు.
ఇక 'భరత్ అనే నేను' వేడుక సందర్భంగా పక్కపక్కనే కూర్చున్న మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లని చూస్తే కనుల పండువగా ఉందని, వీరిని చూస్తే 'పోకిరి', 'యమదొంగ'లని కలిపి తీయాలని , దానిని తాను నిర్మించాలనే కోరిక కలుగుతోందని, ఆ చిత్రం పేరు 'దేవుడు చేసిన మనుషులు' అని బ్రహ్మాజీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక 'భరత్ అనేనేను' చిత్రాన్ని ఏ దర్శకుడంటే వారు తీయలేరని, కేవలం కమిట్‌మెంట్ , నిజాయితీ ఉన్న కొరటాల శివ వంటి వారే తీయగలరని చెప్పాడు. ఈ చిత్రం చూసిన తర్వాత ఖచ్చితంగా అందరు ఈ చిత్రం గురించి రెండు మూడు గంటలు మాట్లాడుకుంటారని ఆయన తెలిపాడు. ఇక మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ, గతంలో కొరటాల శివ, మహేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' ఎంత పెద్ద హిట్టో తెలుసు. ఈ చిత్రం కూడా అలాగే ఆడుతుందని నా నమ్మకం. నా నమ్మకాన్ని నిలబెట్టి అందరు మీ ఆశీస్సులతో నిజం చేయండి అని కృష్ణ కోరారు. ఇక ఈవేడుకలో మాట్లాడేందుకు ప్రకాష్‌రాజ్ వచ్చిన వెంటనే జనంలోంచి 'ఫాదర్' 'ఫాదర్' అంటూ అరుపులు వినిపించాయి. కాసేపు వాటిని వింటూ నవ్వుకున్న ప్రకాష్‌రాజ్ మరోసారి ప్రసంగించబోగా మరలా అలాంటి అరుపులే వినిపించడంతో ప్రకాష్‌రాజ్ నొచ్చుకుని మాట్లాడకుండా మౌనం వహించి వెళ్లిపోయారు. యాంకర్ సుమ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా అది వీలుకాలేదు.