ఏతరం వారినైనా, ఏపార్టీ వారినైనా అడగండి. ఎంతో కాలం రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు, రాజకీయ నేతలు, అనుభవజ్ఞులు, మీడియా ప్రతినిధులు ఇలా ఎవరిని అడిగినా వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్ చేస్తున్న వ్యాఖ్యలు మరీ ఇంత దిగజారుడు రాజకీయాలుగా మారుతున్నాయా? అని ఆవేదన వ్యక్తం అవుతోంది. నిజానికి చంద్రబాబు, జగన్ ఇద్దరు దొందు దొందే. కానీ రాజకీయంగా చంద్రబాబుకి ఉన్న హుందాతనం ప్రతిపక్ష నేతగా జగన్‌కి లేదు. గెలుపోటములను ఓటర్లు నిర్ణయిస్తారు. అంతేగానీ నడిరోడ్డుపై ఉరి వేయండి, గుడ్డలూడదీసి కొట్టండి.. ఒక అబ్బా అమ్మకి పుట్టిన వాడేనా, బావిలోనో గొయ్యిలోనో దూకి చంద్రబాబు చనిపోతే శని వదిలి పోతుంది వంటి వ్యాఖ్యానాలు ఏ విధంగానూ సరికాదు. ఈయన కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయనకు కూడా ఓ హోదా ఉంది. కేబినెట్ హోదా అది. తమని ఎన్నికల్లో గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను అసెంబ్లీ, పార్లమెంట్‌లలో అధికార పార్టీలను కడిగి పారేయాల్సింది పోయి తన ఎమ్మెల్యేలు, ఎంపీలను అసెంబ్లీకి హాజరు కావద్దని ఆదేశించడం నిజమైన ప్రతిపక్షం చేయాల్సిన పనేనా? ఏ పని విషయంలో మాట్లాడినా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత మీకు అది చేస్తాను.. ఇది చేస్తాను. మీ అన్నయ్య సీఎం అవుతాడు వంటి ప్రగల్బాలు పలికే జగన్‌ది అపరిపక్వత రాజకీయాలు. కేవలం ముఖ్యమంత్రి అయితేనే ఆయన చేస్తాడా? ప్రతిపక్ష నేతగా ఏమీ చేయలేడా? గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా నా కడుపున ఎందుకు పుట్టావా? అని నీ తల్లి బాధపడుతుంది అని చంద్రబాబుని ఉద్దేశించి... ఏడుకొండల వెంకటేశ్వరస్వామికి అవరసరమా? వంటి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తన తండ్రి కంటే వందరెట్లు నీచంగా జగన్ మాట్లాడుతూ, రాజకీయాలను నేరబారు, చేపల సంతలా మార్చాడనే చెప్పాలి. ప్రత్యేకహోదా విషయంలో అన్ని పార్టీల వైఫల్యం ఉంది.
ఇక రాష్ట్రం విడిపోవడంలో కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరు భాగస్వాములు. ఇక నాడు చంద్రబాబు, మోదీలకి మద్దతు పలికిన జనసేనాని పవన్‌ది కూడా ఇందులో పాత్ర ఉంది. కాదనలేం. కానీ జగన్ వారిని ప్రశ్నించే తీరు, ఆయన, రోజా, విజయ సాయిరెడ్డి వంటి వారు మాట్లాడుతున్న హీనస్థాయి భాషని ఉపయోగించడం సరికాదు. ఇక పవన్ నేడు రియలైజ్ అయ్యాడు కాబట్టే నేడు టిడిపికి, వైసీపీకి ఆయన సమాన దూరంలో ఉంటున్నాడు. తప్పులు చేయడం సహజం. వాటిని గుర్తించి మూర్ఖంగా వాదించకుండా తప్పుని సరిదిద్దుకోవడం ముఖ్యం. ఇక పవన్‌ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, పవన్‌ది సినిమా తక్కువ... ఇంటర్వెల్ ఎక్కువ. ఈ నాలుగేళ్లలో పవన్ ప్రత్యేకహోదా కోసం ఏ ఉద్యమం చేశాడు? చంద్రబాబు అవినీతిలో పవన్‌కి కూడా భాగస్వామ్యం ఉంది. ఆరునెలలకు ఒకసారి ప్రెస్‌మీట్, ట్వీట్‌పెట్టడం, చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడు బయటకి రావడమే పవన్‌కి తెలుసు అని ఆరోపించాడు. కానీ పవన్‌ది సినిమా తక్కువ.. ఇంటర్వెల్ ఎక్కువ అనేది నిజమోకాదో గానీ ఆడని చిత్రానికే పబ్లిసిటీ ఎక్కువ. ఆరిపోయే దీపానికే వెలుగు ఎక్కువ. అసలు విడుదలైన ఓపెనింగ్స్ కూడాలేని చిత్రం, ల్యాబ్‌లో దుమ్ముపట్టిన చిత్రంగా జగన్, వైసీపీ మిగలకూడదు అని భావిస్తే మాత్రం ఆయన ముందుగా తన భాషని మార్చుకోవాల్సివుంది..!