భరత్ అనే నేను సినిమాపై ఎంతగా అంచనాలున్నాయో అందరికి తెలిసిన విషయమే. 'భరత్ విజన్' లోనే భరత్ అనే నేను పవర్ చూసేశాం. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో మరోసారి మహేష్ సూపర్ హిట్ కొట్టబోతున్నాడంటూ ఘట్టమనేని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక భరత్ అనే నేను ట్రైలర్ కూడా వచ్చేసింది. శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన భరత్ బహిరంగ సభలో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా 'భరత్ అనే నేను' థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. భరత్ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్టీఆర్ ని చూసి మహేష్ తో పాటు కొరటాల అలాగే మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
ఇకపోతే భరత్ అనే ట్రైలర్ లో మహేష్ యంగ్ సీఎం గా, అసెంబ్లీలో మాట్లాడడం దగ్గర నుండి... పేదలను ఆదుకోవడం, స్టైలిష్ గా యాక్షన్ సీన్స్ లో, హీరోయిన్ కైరా అందాలను కెమెరాలో బంధించడం, ఎమోషనల్ సీన్స్ వంటి వన్నీ ఉండేలా ట్రైలర్ వదిలారు. కథను పూర్తిగా అర్ధం కాకుండా తెలివిగా భరత్ అనే నేను ట్రైలర్ కట్ చేశాడు కొరటాల శివ. స్టూడెంట్ గా పట్టా పొందిన భరత్ అనుకోకుండా రాజకీయ అరంగేట్రం చేసి.. చిన్న వయసులో సీఎం అవడమే కాదు. రాజకీయాలను ప్రక్షాళన చెయ్యడానికి కంకణం కట్టుకోవడం దగ్గర నుండి.. మహేష్ చెప్పే ప్రతి డైలాగ్ పొలిటికల్ పంచుల్లా వున్నాయి. 'తప్పు జరిగితే దానిని సరిచేయడానికి కొంచెం కఠినంగా ఉండడానికి కరెక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తే... మీకు రాచరికం రాజులు గుర్తొచ్చారేమో... కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పుచేస్తే దండించిన మా అమ్మా నాన్న గుర్తొచ్చారు'. అలాగే జనం పట్ల ఎందుకంత కఠినంగా వున్నారో ఒక వివరణ ఇమ్మని మీడియా వాళ్ళు భరత్ ని కార్నర్ చేస్తే... 'అంతఃకరణ శుద్ధితో' అంటూ కళ్ళజోడు పెట్టుకుంటూ స్టైలిష్ లుక్ తో మహేష్ అదరగొట్టేశాడు. ఇక రావు రమేష్ చెప్పిన డైలాగ్ 'ఎట్టకేలకొక్కడొచ్చాడబ్బా.... రాజకీయ నాయకుడనుకున్నా... నాయకుడు' అంటూ చెప్పే డైలాగ్ బావుంది. ఇక మహేష్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి 'త్వరలోనే మిమ్మల్నందరిని మాట మీద నిలబడే మగాళ్ళని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అని చెప్పే డైలాగ్ తో పాటు... అసెంబ్లీలో... డౌట్స్ క్లియర్ అయితే నేను ఇంటికి వెళ్తాను అని మహేష్ బాబు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అయ్యింది.
ఇక కైరా అందాలు, దేవిశ్రీ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని ఈ ట్రైలర్ కి అదనపు ఆకర్షణులుగా నిలుస్తున్నాయి. ఇక సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, దేవరాజ్, రవి శంకర్ ఈ ట్రైలర్ లో రాజకీయ నేతలుగా కనబడుతున్నారు. అయితే ఈ ట్రైలర్ అనుకున్నంతగా ఆకర్షించలేదు కానీ సినిమాలో ఏదో కొత్త విషయం చెప్పబోతున్నారనే ఇంపాక్ట్ ని అయితే కలిగించింది. అదేంటి అనేది తెలియాలంటే.. ఏప్రిల్ 20 వరకు ఆగాల్సిందే.