'జబర్దస్త్' ఫేమ్ మహేష్ 'రంగస్థలం' చిత్రంలో రామ్‌చరణ్ స్నేహితునిగా పూర్తి నిడివి కలిగిన పాత్ర పోషించడం, అందులో ఆయన అద్భుతంగా నటించడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇప్పుడు కమెడియన్స్ హీరోలుగా మారుతున్నారు. హీరోగా మారిన సునీల్ మరలా కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సమయంలో సప్తగిరి, షకలక శంకర్ వంటి వారు హీరోలుగా మారి డిమాండ్ పోగొట్టుకున్నారు. దీంతో వెన్నెలకిషోర్, శ్రీనివాస రెడ్డితో పాటు నిన్నటి వరకు ప్రియదర్శి బాగా చేస్తున్నాడని ప్రశంసలు పొందుతున్నారు.. ఇదే క్రమంలోఇప్పుడు జబర్ధస్త్ మహేష్ వంతు వచ్చింది. తాజాగా ఆయన మాట్లాడుతూ, 'జబర్దస్త్' వల్లనే నా కామెడీ టైమింగ్ మెరుగు పడింది. నన్ను అభినందిస్తూ ఫోన్లు వస్తున్న ప్రతిసారి సుకుమార్ గారే కళ్లముందు కనిపిస్తున్నారు. ఆయనే నాకు ఈ చాన్స్ ఇచ్చారు. జీవితం ధన్యమయ్యే పాత్రని నా చేత చేయించారు. అసలు రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోతో, సుకుమార్ దర్శకత్వంలో ఇంత పెద్ద చిత్రంలో అంత నిడివి ఉన్న పాత్రను చేస్తానని అసలు ఊహించలేదు. కేవలం ఫోన్ అభినందలకే నేను 100శాతం చార్జింగ్ పెట్టిన ఫోన్ చార్జింగ్ అయిపోయి స్విచ్చాఫ్ అయిపోతుందని కలలో కూడా ఊహించలేదు. నేను 2011లో కోకాకోలా కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. నాటి నుంచి సుకుమార్‌ని కలుస్తూనే ఉన్నాను. ఇంతకాలానికి నాకు తగ్గ పాత్ర కావడంతో నాకు ఇచ్చారు.
ఇక నా గురించి పలువురు పెద్దలు పొగుడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది.రవిరాజా పినిశెట్టి గారు కేవలం నా గురించే ఏకంగా ఐదు నిమిషాలు మాట్లాడటం మర్చిపోలేను. ఇక జగపతిబాబు వంటి గొప్పవారు కూడా నన్ను ప్రశంసిస్తున్నారు. మొదటిరోజు రామ్‌చరణ్ వంటి స్టార్‌తో అంటే భయపడ్డాను. కానీ ఆయన క్లోజ్‌గా భుజంపై చేయివేసి ఏమీ భయపడవద్దని ఎంతో ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చారు. ఈ చిత్రంలో నాకు ఇంత పేరు రావడానికి సుకుమార్ గారితో పాటు రామ్‌చరణ్ గారు కూడా కారణం. వారికి రుణపడి ఉంటాను. ఇక నేను ఓ చిన్న సీన్‌ని చాలా టేక్‌ల వల్ల చేయలేకపోయాను. ప్రతిసారి నవ్వు రావడం వల్ల డైలాగ్స్ సింక్ కాలేదు. దాంతో రామ్‌చరణ్ గారు మహేష్ ఎండ్‌లెస్ టేక్స్... ఫన్ టైమ్స్ అని ఓ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయిపోయి మూడు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది కాల్ చేశారు. షూటింగ్ లేటయ్యింది. నాకు నిద్ర లేకుండా చేశాడని రామ్‌చరణ్ సరదాగా ఆ వీడియోని పోస్ట్ చేశాడు. ఇక సుకుమార్ ఎప్పుడు చేయబోయే షాట్‌ని అప్పుడే చెప్పేవాడు. ఆ సీన్ తీసే ముందు వరకు అది ఏ సీనో మనకి తెలయదు. అలా స్పాంటేనియస్‌గా వచ్చే నటనే ఆయనకిష్టం. ఎందుకంటే ముందుగానే అన్ని చెప్పేస్తే మనసులో డ్రమటిక్‌గా నటన వస్తుంది. అందుకే సుకుమార్ గారు ఎప్పటి సీన్ అప్పుడే చెప్పేవాడు అని తెలిపాడు.