ఎన్నో ఏళ్ల నుంచి నటిస్తున్న ఎందరో ఇప్పటికీ తెలుగును తుంచి తుంచి నానా భ్రష్టు పట్టిస్తున్నారు. రాజశేఖర్, సుమన్ వంటి వారైతే ఇప్పటికీ డబ్బింగ్ ఆర్టిస్టుల మీద ఆధారపడుతూ ఉంటున్నారు. కానీ నేటితరం భామలు అందునా మలయాళకుట్టీలు మాత్రం రెండు మూడు చిత్రాలకే తమ సొంత డబ్బింగ్‌ని చెప్పుకుంటూ ఉన్నారు. సాయిపల్లవి అయితే మొదటి చిత్రం 'ఫిదా'లోనే ఎంతో క్లిష్టమైన తెలంగాణ యాసను కూడా సొంతంగా చెప్పి వావ్ అనిపించింది. ఇక సమంత ప్రస్తుతం ఓ తమిళ చిత్రానికి, తెలుగు చిత్రానికి కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పాలనే యోచనలో ఉంది. రాశిఖన్నా వంటివారు మాటలే కాదు.. పాటలు కూడా పాడేస్తున్నారు. ఇక కీర్తిసురేష్ ఇటీవల తానే సొంతగా 'అజ్ఞాతవాసి'కి డబ్బింగ్ చెప్పింది. కానీ ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో ఆమె ప్రతిభకు తగ్గ ప్రతిఫలం అందలేదు.
ఇక నాటి సావిత్రి అంటే లెజెండ్‌లకే లెజెండ్. అలాంటి మహానటి పాత్రను పోషించి, ఆమెలా హావభావ విన్యాసాలు, క్షణాలలో వేయి భావాలు చూపించగల విన్యాసాలు ఆమెకే సొంతం. ఈ విషయంలో ఆమెని మించిన వారు ఇప్పటివరకు ఎవ్వరూ లేరు. ఇక కీర్తిసురేష్ 'మహానటి'లో సావిత్రి పాత్రను ఓ చాలెంజ్‌గా తీసుకుంది. ఈ పాత్రలో ఆమె రాణించకపోతే తీవ్ర విమర్శలు తప్పవని ఆమెకి కూడా తెలుసు. ఇప్పటికే జమున వంటి వారు సావిత్రిగా పరభాషా హీరోయిన్‌ని తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బహుభాషా చిత్రంగా విడుదల చేయడం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్, అశ్వనీదత్‌లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నారు.
ఇక సావిత్రిలో మరో అద్భుతం ఏమిటంటే ఆమె స్క్రీన్‌పై కనిపించకున్నా ఆమె డైలాగ్స్ చెబుతూ ఉంటే మనం ఆమెని చూడకుండానే ఆమె ఏ సీన్‌లో ఎలా యాక్ట్ చేస్తుందో తెలసుకోవచ్చు. మరి కీర్తిసురేష్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈసారైనా వస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం డబ్బింగ్ తాజాగా ప్రారంభమైంది. మే 9వ తేదీన 'మహానటి' థియేటర్లలోకి వస్తేనే కీర్తిసురేష్ మీద కరెక్ట్ జడ్జ్‌మెంట్ వస్తుంది.