అనసూయ అంటే అల్లరి.. అనసూయ అంటే గడుసుతనం.. అనసూయ అంటే గ్లామర్. కానీ ఈ నిర్వచనాలన్నింటిని 'రంగస్థలం' చిత్రంతో సుకుమార్ పూర్తిగా మార్చివేశాడు. ఈ చిత్రానికి ఎంత గొప్ప ఫీడ్ బ్యాక్ వస్తోందో రంగమ్మత్త పాత్రకి కూడా అంతే పేరు వస్తోంది. ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, నా అమాయకత్వం వల్ల బుల్లితెరపై గ్లామరస్ గా ఉంటేనే బాగుంటానని భావించాను. నన్ను చూసి దర్శకులు కూడా అనసూయ ఇలాంటి పాత్రలైతేనే చేస్తుందేమో అని భావించారు. నేను ఓ చిత్రాన్ని ఓకే చేసేటప్పుడు ఎంతో ఆలోచిస్తా.. బాగుందని అనిపించి మేకప్ వేసుకుని కెమెరా ఆన్ అయిపోతే ఇంకేమీ పట్టించుకోను. ఇక నా గురించి నేను తక్కువగా ఊహించుకోను. అలాగని ఎక్కువగా కూడా ఊహించుకోను. నేను ఇద్దరు పిల్లల తల్లిని అంటే ఎలాంటి పాత్రలు వస్తాయో ఊహించుకోగలను. కానీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇక 'క్షణం' చిత్రం తర్వాత అలాంటి చిత్రాలే ఓ డజను వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు 'రంగస్థలం' తర్వాత కూడా ఇలాంటి పాత్రలు నాకు చాలా వస్తాయని తెలుసు. కానీ ఒకే విధంగా ఉండే పాత్రలు నేను ఒప్పుకోను. ప్రతి పాత్రా వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక తెలుగులో తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ యాసలు ఉన్నాయని మాత్రమే నాకు తెలుసు.
కానీ ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, గోదావరి ఇలా వీటిల్లో కూడ ఎన్నో యాసలు ఉంటాయని తెలియదు. అది ఈ చిత్రంతో అర్ధమైంది. అయినా రామ్‌చరణ్ చెప్పినంత గొప్పగా నేను ఆ యాసని చెప్పలేక పోయాను. నా దృష్టిలో కథ, సినిమా మాత్రమే హీరో.. మిగిలిన నటీనటులందరు ఆర్టిస్టులే. నటిగా నిరూపించుకునే ఏ పాత్ర అయినా చేస్తాను. నా దృష్టిలో నేను లేడీ ప్రకాష్‌రాజ్‌ని. ఆయన చూడండి.. ఏ పాత్రలోనైనా ఎంతగా ఒదిగిపోతాడో? నాకు కూడా అలా పేరు తెచ్చుకోవాలని కోరిక. చరణే కాదు.. షూటింగ్ స్పాట్‌లో అందరు నన్ను రంగమ్మత్త అనే పిలిచేవారు. ఈ సినిమా కథ సుకుమార్ చెప్పిన తర్వాత ఈ చిత్రంలో నేను నటించాల్సిందే. కానీ అత్త అని పిలిపించుకోకూడదని అనుకున్నాను. కానీ డబ్బింగ్ చెబుతున్నప్పుడు నా పాత్రపై నాకు నమ్మకం కుదిరింది. రంగమ్మ అని కాకుండా రంగమ్మత్త అని పిలిపించుకోవడమే బాగుందని చెప్పుకొచ్చింది. ఇక మీడియా వారికి ఎందుకో ఏమో నేను చేసే పనులు నచ్చలేదు. దాంతో పెళ్లయిన తర్వాత కూడా ఇలాంటి డ్రెస్‌లు, పాత్రలు ఏమిటి? అని అనుకుని ఉంటారు. నాకు చాలా సార్లు కోపం వచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా అందరూ తమ వృత్తిలో సాగుతున్నారు. నేను చేస్తే తప్పేంటి? అని భావించాను. కానీ ఆ తర్వాత వారు నన్ను వాళ్లింట్లో అమ్మాయిగా భావిస్తున్నారని మీడియా కోణంలో ఆలోచించాను. దాంతో అదే సర్ది చెప్పుకున్నాను అని చెప్పుకొచ్చింది.