గత నెల రోజులుగా ఏ చిత్రాలలో నటించిందో కూడా తెలియని శ్రీరెడ్డి సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోంది. రెగ్యూలర్‌గా అన్ని సినిమాలు చూసే వారికి కూడా ఆమె ఎవరో తెలియదు. ఇక 'పోకిరి' చిత్రంలో ప్రకాష్‌రాజ్ చెప్పినట్లు నేను రజనీ, చిరులతో ఫొటోలు దిగాను. వారిని కూడా కేసులోకి లాగుతాను అన్నట్లుగా శ్రీరెడ్డి వ్యవహారం ఉంది. నిజానికి ఆమె శేఖర్‌కమ్ములనే టార్గెట్ చేసిందని ఆందరికీ అర్ధమైంది. కానీ దీనిని శేఖర్‌కమ్ముల లైట్‌గా తీసుకుని స్పందించకుండా ఉండి ఉంటే అదే విషయం ఓ వారం, పది రోజుల్లో అందరు మర్చిపోయేవారు. కానీ శేఖర్‌కమ్ముల తీవ్ర ఆవేదనతో భగ్గుమనడంలో శ్రీరెడ్డి ఎత్తుగడ ఫలించింది. ఈ విషయంపై వాదోపవాదాలు ముదురుతున్నాయి. తాజాగా శేఖర్‌కమ్ముల ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పడంతో శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. నేను నా ఫీలింగ్స్ చెప్పుకుంటూ ఉంటే ఎవరెవ్వరో పిచ్చికూతలు కూస్తున్నారు. అలాంటి వారి తాట తీస్తా. నేను అన్యాయానికి గురయ్యాను. కాబట్టే నా వాదనను గట్టిగా వినిపిస్తున్నాను... అంటూ శేఖర్‌కమ్ములపై మండిపడింది.
నా సోషల్ మీడియా పేజీలో ఏదైనా రాసుకుంటాను. నీ పేరు మెన్షన్ చేశానా? నీ సినిమా పేరు మెన్షన్ చేశానా? ఈరోజు నువ్వు చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని, జైల్లో పెట్టిస్తానని వాగుతున్నావు. చట్టప్రకారం వెళ్తావా? వెళ్లు. నాకేమైనా భయమా? నీవు శేఖర్‌కమ్ముల అయితే నాకేంటి? నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి? సినీ పెద్దలందరికీ ఒకే మాట చెబుతున్నాను. నేను ఒంటరిని అయినప్పటికీ కావాల్సినంత ధైర్యం ఉంది. పోరాటానికి డబ్బులు అవసరం లేదు. గుండెల్లో ధైర్యం ఉంటే చాలు.. మీరు తప్పు చేయనప్పుడు మౌనంగా ఉండవచ్చు కదా...! నేను కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోనున్నాను. త్వరలోనే నోటీసులు అందుతాయి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం మానుకోండి.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఇక శేఖర్‌కమ్ముల అనవసరంగా బురదలో రాయి వేశాడని కొందరు అంటుంటే.. ఎంతకాలం మౌనం. అందరి మీద ఆనుమానాలు వచ్చే విధంగా బ్లాక్‌మెయిల్ ఎంత కాలం భరించాలి? అని కొందరు అంటున్నారు. ఇంకొందరు టాలీవుడ్‌పై శ్రీరెడ్డి బురద జల్లుతోందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.