వాస్తవానికి సుకుమార్ చిత్రాలంటే ఇంటెలిజెంట్ ప్రేక్షకులకు నచ్చే చిత్రాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆయన తీసిన అన్ని చిత్రాలు అదే కోవలోకి వస్తాయి. కానీ 'రంగస్థలం'తో మాత్రం ఆయన దానిని తప్పు అని నిరూపించాడు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని, మాస్, కమర్షియల్ అంశాలు జతపరుస్తూనే క్లాస్‌గా చెబితే తనకి తిరుగేలేదని నిరూపించుకున్నాడు. అయితే ఆయన నుంచి బాగా క్లాస్ టచ్‌ని ఆశించే వారు మాత్రం కాస్త 'రంగస్థలం' విషయంలో డిజప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. అలా కాకుండా ఇక నుంచి సుకుమార్ హైనాల్జెడ్, మరీ నేల బారు మాస్ అంశాలను కాకుండా మద్యస్తంగా తన చిత్రాలను తీయగలిగితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని చెప్పాలి. ఇక 'రంగస్థలం' చిత్రంలో సుకుమార్ దర్శకునిగా ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కాడు. దీంతో నాన్ బాహుబలి రికార్డులను కైవసం చేసుకునే దిశగా వెళ్తున్న 'రంగస్థలం' తర్వాత సుకుమార్ చేయబోయేది ఏ హీరోతో అనే ప్రశ్న ఉదయిస్తోంది. సాధారణంగా సుకుమార్ కథలను తయారు చేసుకోవడానికి, సినిమాని తీయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటాడనే విమర్శ ఉంది. కానీ దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతూ, రంగస్థలం చిత్రం కథని తయారు చేయడానికి నేనేమి పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం చెవిటి వారిని పరిశీలించడం, నాటి గ్రామీణ నేపధ్యం పరిశీలనకే ఎక్కువ సమయం తీసుకున్నానని చెబుతూనే, ప్రస్తుతం తన వద్ద రెండు మూడు కథలు సిద్దంగా ఉన్నాయని, కథని బట్టి హీరోని సెలక్ట్ చేసుకుంటానని అంటున్నాడు.
ఇక ప్రస్తుతం మహేష్‌బాబు 'భరత్ అనే నేను' తర్వాత ఆయన 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి చిత్రాలు చేయనున్నాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి రాజమౌళి మల్టీస్టారర్, రామ్‌చరణ్ బోయపాటి శ్రీను, తదుపరి జక్కన్నమల్టీస్టారర్ వంటి వాటితో బిజీగా ఉన్నారు. ఇక ఖాళీగా ఉన్న యంగ్‌స్టార్‌లో అల్లుఅర్జున్ 'నాపేరు సూర్య- నాఇల్లు ఇండియా' చిత్రం తర్వాత ఎవరితో అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఆయన సుకుమార్‌తో చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ బన్నీతో చేయడం లేదని సుకుమార్ చెప్పాడు. ఇక 'రంగస్థలం' సమయంలోనే అక్కినేని కోడలు సమంత సుకుమార్‌ని తన మరిది అఖిల్‌తో సినిమా చేయాలని కోరిందంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో సుకుమార్ నాగచైతన్యతో కూడా '100%లవ్' చేశాడు. కాగా ప్రస్తుతం అఖిల్ 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. ఇక సుకుమార్ మాట్లాడుతూ ప్రభాస్‌తో ఓ చిత్రం చేయాలని ఉందని తెలిపాడు. ఇక ప్రభాస్‌ని ఆయన కలసి రెండు మూడు లైన్లు కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రభాస్ 'సాహో' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అనంతరం ఆయన జిల్ రాధాకృష్ణతో చేస్తాడని వార్తలు వచ్చాయి. ఈ లెక్కన ప్రభాస్, సుకుమార్ ఇద్దరు కలిసి చేసేందుకు సిద్దంగా ఉన్నా కూడా ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల అది వెంటనే నెరవేరుతుందా? లేదా? అనేది వెయిట్ చేయాల్సివుంది.