బాలయ్యపై ఓ అపవాదు ఉంది. ఆయన మూడీ ఫెలో అని, ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు సంతోషం వస్తుందో, ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు చెంపపగుల గొడతాడో తెలియదనే వార్త ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. అందుకే ఆయన చిత్రాలలో నటించే వారు ఒకటి రెండు సార్లు ఆలోచనలో పడతారు. షూటింగ్ పూర్తయిన తర్వాత మాత్రం బాలయ్య చాలా జోవియల్ అని చెబుతుంటారు. అయినా ఆయనతో కలిసి పనిచేయడం అంటే బాగా రిస్క్ అనే అభిప్రాయం పాతుకు పోయింది. ఇక దర్శకుడు తేజపై కూడా నటీనటులపై చేయి చేసుకుంటాడని, ఎవ్వరినీ లెక్క చేయని వాడనే అపవాదు ఉంది. ఇలాంటి సమయంలో 'ఎన్టీఆర్' బయోపిక్‌లో తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌లా బాలయ్య చేస్తుండగా, దర్శకత్వం తేజ చేయనున్నాడు. ఇటీవలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు దిగ్గజాలు ఈ సినిమా లాంచ్‌కి విచ్చేశారు. ఇక తెలుగు పరిశ్రమలో బాలకృష్ణ, తేజలతో నటించాలంటే కొత్త అమ్మాయిలు, లేదా బాలీవుడ్, పరభాషా హీరోయిన్లు తప్ప మనవారు ఒప్పుకునే పరిస్థితి లేదు. దాంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర ఎంతో నిండైన, కీలకమైన పాత్ర.
ఇందులో నటింప జేసేందుకు ఈ చిత్ర యూనిట్ విద్యాబాలన్‌ని అడుగుతోందని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో నటించడానికి ఆమె తిరస్కరించడంతో ఆ పాత్రలో దీపికా పడుకొనేని తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అయినా విద్యాబాలన్ నిండుదనం దీపికా పడుకొనేకి లేదు. అందులోనూ దీపికా పడుకోనే ఇప్పుడు 'పద్మావత్' తర్వాత వరుస బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలను ఒప్పుకుంటోంది. త్వరలో ఆమె శ్రీదేవి బయోపిక్ కూడా చేయనుందని వార్తలు వస్తున్నాయి. మరి బసవతారకం పాత్రకి దీపికా అయినా ఓకే చెబుతుందా? లేదా? అనేది అనుమానమే. మరి బెటర్ ఆప్షన్‌గా ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఇక తాజాగా చంద్రబాబు పాత్రను రాజశేఖర్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ చిత్రంలోని పలు పాత్రలకు నటీనటులను ఎంపిక చేయడం కష్టసాధ్యమైన పనే. ఇక ఈ చిత్రం విషయంలో బడ్జెట్ పరంగా, నటీనటులు, సాంకేతిక నిపణుల పరంగా ఎలాంటి రాజీ ఉండకూడదని బాలయ్య భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరితో పాటు బాలయ్య కూడా భాగస్వామ్యంతో నటిస్తున్న సంగతి తెలిసిందే.