కాలంతోపాటు వయసు పెరగడం ప్రకృతి సహజం. అది ఆపితే ఆగేదికాదు. ఇక పెరుగుతున్నవయసుకు అనుగుణంగా వయసుకి గౌరవం ఇవ్వడం మన బాధ్యత. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మాత్రం మా మనసు ఇంకా యవ్వనంలోనే ఉందంటూ కుర్ర హీరోయిన్ల సరసన, ఏదో డ్రీమ్ బోయ్స్ తరహాలో పాత్రలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో నాగార్జున, వెంకటేష్‌లు మాత్రం తమ మెచ్యూరిటీని చూపిస్తూ తమని ఇంకా యువ సామ్రాట్ వంటి బిరుదులతో పిలవవద్దని, తాము ఈ వయసులో వయసుకు తగ్గ పాత్రలు, కోడళ్లు, మనవళ్లు వచ్చే సమయంలో అదే తరహా పెద్ద మనిషి పాత్రలకు ఓకే చెబుతున్నారు. ఇక తెలుగులో వెంకటేష్ కమల్‌హాసన్‌తో 'ఈనాడు', మహేష్‌బాబుతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', రామ్‌తో'మసాలా'. పవన్‌కళ్యాణ్‌తో 'గోపాల గోపాల' వంటి చిత్రాలు చేశాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నారా రోహిత్‌తో, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' చిత్రంలో మెగా హీరో వరుణ్‌తేజ్‌తో, బాబి దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి నటించనున్నాడు. ఇలా తాను సీనియర్ స్టార్‌గా, యంగ్‌స్టార్స్‌తో కలసి నటిస్తున్నాడు.
ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన గతంలో శ్రీకాంత్, మోహన్‌బాబు, మంచు విష్ణు వంటి వారితో తన వయసుకు తగ్గ పాత్రలు చేశాడు. ఇటీవల తమిళ యంగ్ స్టార్ కార్తితో 'ఊపిరి' అనే బైలింగ్వల్ చేశాడు. ఇప్పుడు అశ్వనీదత్ నిర్మాతగా నేచురల్ స్టార్ నానితో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇక ఆమధ్య 'శమంతకమణి' వంటి చిత్రంలో నలుగురు యంగ్ హీరోలతో సినిమా తీసి బాగానే హ్యాండిల్ చేసిన శ్రీరాం ఆదిత్య నాగార్జున-నానిల చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకవైపు నాగార్జున -వర్మ కాంబినేషన్‌లో 'ఆఫీసర్'ని పూర్తి చేయగా, నాని మేర్లపాక గాంధీతో 'కృష్ణార్జునయుద్దం' పూర్తి చేశాడు. తాజాగా నాగ్-నానిల షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో పాల్గొనేందుకు వెళ్తున్న నాని ట్వీట్ చేస్తూ, షూటింగ్‌కి వెళ్లే సమయంలో చిన్నపిల్లాడిలా యాంగ్జైటీగా ఫీలయ్యానని, కారణం నాగార్జున గారితో కలిసి మొదటిసారి షూటింగ్‌లో పాల్గొనడమే కారణమని తెలిపాడు. నాగార్జునకి స్వాగతం అంటూ సినిమాకి సంబంధించిన ఫొటోని కూడా పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.