సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా, రామ్‌చరణ్, సమంత నటించిన 'రంగస్థలం' చిత్రం 100కోట్లు కొల్లగొట్టి ఇంకా తన పవర్‌ని చూపిస్తూనే ఉంది. ఇది శ్రీమంతుడు, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇది రామ్‌చరణ్ కెరీర్‌లో 'మగధీర' స్థాయిని మించిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలోఈ ఏడాది మొదటి బ్లాక్‌బస్టర్‌గా పరిగణిస్తున్న ఈ చిత్రం మీద వివాదాలు ఏమీ రాలేదు అనుకుంటున్న సమయంలో సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ ట్రాక్‌ని తీసివేశారని, నిడివి సమస్య వల్ల ఇలా జరగడం పృథ్వీని బాధిస్తోందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు శివనాగులు వివాదం 'రంగస్థలం'కు తగులుకుంది. 'గట్టునుంటావా' అంటూ జానపద గాయకుడు శివనాగులు పాడిన పాట ఈ ఆల్బమ్‌లోనే పెద్ద హిట్టయింది. ఇక ఈ చిత్రం విడుదలైతే అన్ని పాటను మించి ఈ చిత్రంలోని ఈ పాట, శివనాగులు వాయిస్ ప్లస్ అయి శివనాగులు రేంజ్ మారిపోతుందని ఆయనతో పాటు ఆయన స్నేహితులు, అందరు భావించారు. కానీ ధియేటర్‌లో మాత్రం ఈ పాటకు శివనాగులు వాయిస్ కాకుండా దేవిశ్రీప్రసాద్ వాయిసే వినిపించింది. దీంతో అందరు కన్‌ఫ్యూజన్‌కి గురయ్యారు. తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా తన వాయిస్‌ని దేవిశ్రీప్రసాద్ వాయిస్‌తో రీప్లేస్ చేయడం పట్ల శివనాగులు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయం ముందుగా తనకి చెప్పి ఉండాల్సిందనే ఆయన వాదనలో నిజముంది.
ఇక ఈ చిత్రంలోని తన పాట కోసం తన స్నేహితులు చిత్రం మొదటి రోజు మొదటి షోకే ఈ సినిమాకి వెళ్లారని, బయటికి వచ్చిన తర్వాత ఆ పాటలో నీవాయిస్ వినిపించలేదు అని అడిగారట. మొదటి రోజు కావడంతో ప్రేక్షకుల గోల మధ్య తన వాయిస్‌ని వారు గుర్తు పెట్టుకుని ఉండకపోవచ్చని శివనాగులు తర్వాతి షోకి వెళ్లి ఆ పాటలో తన గొంతుస్థానంలో దేవిశ్రీ గొంతు వినిపించడం బాధ వేసిందని చెప్పుకొచ్చాడు. దీని గురించి సుకుమార్ మాట్లాడుతూ, ఈ పాట చిత్రీకరణ సమయానికి ఈ పాటను కేవలం దేవిశ్రీ పాడాడని, శివనాగులు అప్పటికి ఇంకా ఆ పాటను పాడలేదని, ఇక శివనాగులు పాట వింటూ ఈ సినిమాని తీస్తే రామ్‌చరణ్‌కి ఆయన వాయిస్ సరిగా సూట్ కాలేదని, రామ్‌చరణ్ బాడీ లాంగ్వేజ్‌కి ఆయన లిప్ మూమెంట్ పాట సింక్ కాకపోవడంతో దేవిశ్రీ వాయిస్‌నే అలాగే ఉంచేశామని చెప్పాడు. ఇక ఆల్బమ్‌లో మాత్రం శివనాగులు పాడిన పాటే ఎప్పటికి ఉంటుందని సుకుమార్ తేల్చిచెప్పాడు. ఏదైనా ఈ విషయం ముందుగా సుకుమార్ గానీ, దేవిశ్రీ గానీ శివనాగులుకి మాట మాత్రంగా అయినా చెప్పి ఉంటే ఈ వివాదం చెలరేగేదే కాదు.