నేడు నిర్మాతలకు డిజిటల్ హక్కుల రూపంలో అదనపు ఆదాయం బాగానే వస్తోంది. కొన్ని చిత్రాలకు శాటిలైట్, డిజిటల్, రీమేక్, డబ్బింగ్ రైట్స్ ద్వారానే బడ్జెట్‌లో సగం పైగా రికవరీ అవుతోంది. దానికి తగ్గట్లుగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు నిర్మాతలకు బోలెడు డబ్బు చెల్లించి వాటిని చిత్రం విడుదలైన నెలరోజుల ముందే తమ వినియోగ దారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక ఈ రోజుల్లో కనీసం 50రోజులు కూడా ఆడే చిత్రాలు లేకపోవడంతో నెల రోజులకే డిజిటల్ రూపంలో ప్రసారమైనా కూడా ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండటం లేదు. కానీ మంచి సినిమాలను, అందునా మరీ ఎక్కువ థియేటర్లలో కాకుండా ఓ మోస్తరు భారీగా విడుదల చేసిన చిత్రాలు మంచి టాక్ వస్తే నేడు కూడా 50రోజుల దాకా కలెక్షన్లను రాబడుతూనే ఉంటున్నాయి. 'బాహుబలి, శ్రీమంతుడు' నేడు 'రంగస్థలం' కూడా మరీ అన్ని థియేటర్లలలో విడుదల చేసే అవకాశం ఉన్నా, 80శాతం థియేటర్లలను బుక్ చేసుకునే సౌకర్యం ఉండి కూడా మరీ పెద్ద ఎత్తున మాత్రం రిలీజ్ చేయలేదు. అదే ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతోంది.
ఇక ఈ చిత్రం 50రోజుల సెంటర్స్ విషయంలో కూడా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని అంటున్నారు. అయితే ఎక్కడ ఈ డిజిటల్ సంస్థ ఈ చిత్రాన్ని నెల రోజుల ముందే తమ వినియోగ దారులకు అందుబాటులోకి తెస్తాయేమోనని బయ్యర్లు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది మొదటి బ్లాక్‌బస్టర్ ఇదే. 'భాగమతి, తొలిప్రేమ' హిట్ అయినా కూడా ఈ స్థాయి హిట్స్ కావు. దాంతో ఈ చిత్రాన్ని కొన్నవారు లాభాల పంట పండనుందని ఆనందంలో ఉండగా, వారికి డిజిటల్ రైట్స్ విషయంలో భయం కలుగుతోంది. కానీ ఈ చిత్ర నిర్మాణ సంస్థ తరపున నిర్మాతల్లో ఒకరైన నవీన్ యేర్నినేని ఈ చిత్రం డిజిటల్ రైట్స్ అమ్మేటప్పుడు సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే డిజిటల్‌లో విడుదల చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నామని కాబట్టి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీకి అమెజాన్ ప్రైమ్ సంస్థ దాదాపు 18కోట్లు వెచ్చించి ఈ హక్కులను దక్కించుకుంది.