హిందీలో కపిల్‌శర్మ నిర్వహించే షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ సిద్దార్ద్ సాగర్. ఈయన తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశాడు. తన తల్లిదండ్రులే తనకి మందు పెట్టి తమ వశం చేసుకున్నారని, తనకి మతిస్థిమితం సరిగా లేదని పిచ్చాసుపత్రిలో చేర్పించారని ఆయన చెప్పారు. సిద్దార్ద్ గత రెండు వారాలుగా అదృశ్యమయ్యాడు. అనుకోకుండా హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. అతనికి మతి భ్రమించిందని, అందుకే రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, ఆ క్రమంలో ఆయన పారిపోయాడని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మీడియా ముందుకు వచ్చిన సిద్దార్ద్ తన తల్లిదండ్రులు తనకి చేసిన అన్యాయం గురించి చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం తనకు తండ్రిని అని చెప్పుకుంటున్న వ్యక్తి తన తండ్రి కాదని, 20ఏళ్ల కిందటే తన తల్లిదండ్రులు విడిపోయారని, తల్లి మరోకరిని పెళ్లి చేసుకుందని, తన సవతి తండ్రి తనని తీవ్రంగా కొట్టి డబ్బులు లాగేసుకుని నానా చిత్రహింసలు పెట్టేవాడని ఆయన ఆరోపించాడు. చివరకు నేను ఎదురు తిరిగే సరికి తనకు మతిస్థిమితం లేదని చెప్పి, మందు పెట్టి, పిచ్చోడిని చేశారని, ఆసుపత్రిలో బంధించారని ఆయన వాపోయాడు. నన్ను పిచ్చోడిని చేసి ఆసుపత్రి పాలు చేయడంతో అక్కడ ప్రతి క్షణం నరకం అనుభవించాను. నాకు ఎలాగైనా విముక్తిని ప్రసాదించండి అని ఆయన వేడుకున్నారు. ఇక ఈ విషయంలో మాత్రం సిద్దార్ద్ చెబుతున్న మాటలు, డాక్టర్ల రిపోర్ట్‌ని చూస్తే అతనికి మతిస్థిమితం లేని విషయం అర్ధమవుతుందని ఆయన తండ్రి వాదిస్తున్నాడు. అయినా ఆయనకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తే తండ్రి ఆయనో కాదో తెలిసిపోతుందని పోలీసులు ఆ ప్రయత్నాలలో ఉన్నారట...!