హీరో నితిన్‌పై స్వామి వారి ఉంగరం దొంగిలింపు కేసు మీద పడింది. వచ్చే శుక్రవారం నితిన్ నటించిన 'ఛల్‌మోహన్ రంగ' చిత్రం విడుదల కానుండటంతో నితిన్ పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. దాంతో ఆయన విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆశీస్సుల కోసం వెళ్లారు. అక్కడి స్వామి వారి అలంకారకులు నితిన్‌ని బంధించి, సంస్థానాధీశులు వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు సంస్థానాధీశులు మీరు సినిమాలలో నటిస్తూ, ఇంత హోదా ఉండి కూడా స్వామి వారి ఉంగరం దొంగిలించడం మంచి పని కాదు అని మందలించాడు. దాంతో నితిన్ బిత్తరపోయాడు. నేను ఏ ఉంగరం దొంగిలించలేదు.. కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఇంతలో ఆలయ అధికారులు స్వామి వారి ఉంగరం పోయిందని చెప్పి మరి కొంతమందిని తాళ్లతో బంధించి తెచ్చారు. స్వామి వారి ఉంగరం దొంగతనానికి గురయింది. ఆ ఉంగరం దొరికే వరకు బంధించిన వారు అక్కడే బందీలుగా ఉండాలని సంస్థానాధీశులు ఆదేశించారు.
దాంతో పట్టుబడిన వారందరూ ఏడుస్తూ మాకే పాపం తెలియదు అని హైరానా పడ్డారు. చివరకు సంస్థానాధీశులు స్వామి వారి ఉంగరం ఉంది. ఇది సింహాద్రి అప్పన్న వార్షిక ఉత్సవాల్లో భాగంగా వినోదోత్సవంలో జరిగిన వేడుకలో భాగమని చెప్పారు. అప్పన్న కళ్యాణోత్సవంలో ఆరోరోజు దొంగల దోపు ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో ఉభయ దేవేరులతో విహారానికి వెళ్లిన స్వామి వారి ఉంగరం కనిపించక పోవడంతో ఉంగరం ఉంటేనే తిరిగి రావాలని అమ్మవారు షరత్తు విధించి అలుగుతుంది. దాంతో స్వామి మరునాడు ఉంగరం వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియమించి, భక్తులను తాళ్లతో బంధింపజేసి తీసుకుని వచ్చి విచారణ చేస్తారు. దీనిలో భాగంగానే నితిన్‌తో పాటు పలువురు భక్తులు దొంగలుగా మారి, తాళ్లతో కట్టివేయబడ్డారు. మొత్తానికి ఈ తతంగం తెలిసిన తర్వాత అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఉంగరం దొంగిలించిన కట్టుబడినట్లుగానే ఆయన 'ఛల్‌మోహన్ రంగ'తో ప్రేక్షకులను కూడా కట్టి పడేస్తాడని ఆశిద్దాం.