సినిమా బాగాలేనప్పుడు బాగా లేదని రాసే వారిని మనవారు ఆడిపోసుకుంటారు. మరి మంచి సినిమాని మీడియా ప్రమోట్ చేస్తున్న విధం గురించి మాత్రం అసలు ఎవ్వరూ మాట్లాడరు. 'భాగమతి, తొలిప్రేమ' నేడు 'రంగస్థలం' చిత్రాలకు మీడియా ఇస్తున్న ఇంపార్టెన్స్, పాటిజివ్ ఫీడ్‌బ్యాక్, మంచి రివ్యూలు కూడా ఈ విజయంలో కీలకపాత్రను పోషిస్తున్నాయని ఘంటాపధంగా చెప్పవచ్చు. సినిమా బాగుండాలే గానీ పైరసీలు, మీడియా బ్యాడ్ రివ్యూలు కూడా జనాలు పట్టించుకోరని ఇప్పటికైనా సినీ పెద్దలు గమనించాలి. ఇక 'రంగస్థలం' చిత్రాన్ని ఓ కళాఖండంగా చెప్పవచ్చు. వాస్తవానికి రామ్‌చరణ్‌కి 'మగధీర' తప్ప మరో వెరైటీ మూవీలేదు. 'ఆరెంజ్' చేసిన ఆడలేదు. ఇక ఆయన వరుసగా మాస్ చిత్రాలు చేస్తూ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల సంగతేమో గానీ ఓవర్‌సీస్‌లో మాత్రం రామ్‌చరణ్ దూకుడు చూపించలేకపోయాడు.
ఇక తన పంధా మార్చి ఆయన చేసిన 'దృవ' రీమేక్ కావడం మైనస్ అయింది. అయినా కూడా 'దృవ' చిత్రం ఓవర్‌సీస్‌లో రామ్‌చరణ్‌ని మిలియన్ డాలర్ల జాబితాలో చేర్చింది. అది కూడా యూనిట్ అంతా కలిసి యూఎస్ వెళ్లి ప్రమోట్ చేస్తేనే అది సాధ్యపడింది. కానీ 'రంగస్థలం' విషయంలో మాత్రం యూఎస్‌లో, ఓవర్‌సీస్‌లో యూనిట్ ఏమాత్రం ప్రమోషన్స్ చేయలేదు. కానీ ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్, మంచి రివ్యూల వల్ల ఈ చిత్రం 'జనతాగ్యారేజ్' చిత్రం ఫుల్ రన్‌లో సాధించిన కలెక్షన్లను రెండో రోజే దాటేసింది. ఇక 'నాన్నకుప్రేమతో' 2.02 డాలర్లు, 'అజ్ఞాతవాసి' 2.07 మిలియన్ డాలర్లు మాత్రమే ముందున్నాయి. ఈ రోజుతో వాటిని కూడా దాటదం లాంఛనమే. ఇక 'రంగస్థలం' తదుపరి టార్గెట్ తన తండ్రి చిరు నటించిన కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదనెంబర్ 150' మాత్రమే. ఇక ఈనెల 5వరకు ఏపీలో ఐదు షోలు వేసుకునే సౌలభ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న చిత్రంగా 'రంగస్థలం'ని చెప్పుకోవచ్చు. సినిమా హిట్ అవుతుందని ఊహించామని, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని మాత్రం తాము అనుకోలేదని బయ్యర్లు ఎంతో ఆనందంగా చెబుతున్నారు.