నిన్నటితరంలో ఏమోగానీ నేటితరం యంగ్ స్టార్స్ మాత్రం సినిమా తెరపై ఎలా ఉన్నా కూడా నిజజీవితంలో మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇది ఇండస్ట్రీ మనుగడకు ఎంతో మంచిది. ఇంతకాలం ఒక స్టార్‌ని మరోస్టార్ మెచ్చుకోవడం అనేది బాలీవుడ్, కోలీవుడ్‌లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ టాలీవుడ్‌కి కూడా వచ్చింది. ఎన్టీఆర్ 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్' చిత్రాలకు పలువురు స్టార్స్ నుంచి అభినందనలు లభించాయి. ఇక ఈయన చేసిన 'జైలవకుశ'లోని జై పాత్రను దాదాపు ఇండస్ట్రీ మొత్తం ప్రశంసలల్లో ముంచెత్తింది. ఇప్పుడు వంతు రామ్‌చరణ్‌కి వచ్చింది. ఆయన చేసిన 'రంగస్థలం' చిత్రం అద్భుతంగా ఉందని, ఇందులో రామ్‌చరణ్‌లోని అసలు సిసలైన నట విశ్వరూపం కనిపించిందని అందరు ప్రశంసిస్తున్నారు. తాజాగా మహేష్ శ్రీమతి నమ్రతా శిరోద్కర్ కూడా చరణ్‌కి కలిసి శుభాకాంక్షలు తెలిపి ఓ గిఫ్ట్‌ని అందించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి, ఇందులో రామ్‌చరణ్ నటన గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
నేను ఇప్పుడు 'రంగస్థలం' చూశానని చెప్పిన ఎన్టీఆర్ రామ్‌చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. సినిమాలో రామ్‌చరణ్ చేసిన నటనకు ప్రశంసలు, పొగడ్తలు, అభినందనలు అందుకునే అర్హత ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. తన తరుపు నుంచి కూడా శుభాక్షాంలు తెలిపాడు. చిట్టిబాబు పాత్రను చరణ్ తప్పితే ఎవ్వరూ అంత గొప్పగా చేయలేరని కితాబునిచ్చి, ఆకాశానికి ఎత్తేశాడు. ఇక రామ్‌చరణ్‌తో కలిసి త్వరలో ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్. మూవీని రాజమౌళి దర్శకత్వంలో అక్టోబర్ నుంచి దానయ్య నిర్మాణంలో చేయనున్న సందర్భంలో ఎన్టీఆర్ రామ్‌చరణ్‌పై కురిపించిన ప్రశంసలకు ప్రత్యేకత ఏర్పడింది. ఇక సుకుమార్‌తో కూడా ఎన్టీఆర్‌కి మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఘనవిజయం సాధించింది. ఇక 'రంగస్థలం'కి కూడా సుకుమారే దర్శకుడు కావడంతో పాటు 'నాన్నకు ప్రేమతో' చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే 'రంగస్థలం'ని నిర్మించడం విశేషం. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ, దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడని, ఆకాలం నాటి పరిస్థితులు, వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడని చెబుతూ, మైత్రిమూవీమేకర్స్ నుంచి రామ్‌చరణ్, సమంత, దేవిశ్రీప్రసాద్, సుకుమార్ ఇలా అందరినీ పేరు పేరునా ఎన్టీఆర్ అభినందించారు.