గతకొన్నిరోజులుగా మెగా ఫ్యామిలీతో పాటు మెగాభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. పవన్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ కావడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్-వినాయక్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంటెలిజెంట్' డిజాస్టర్‌తో వారు మరింత నిరుత్సాహానికి లోనయ్యారు. అయితే అన్నింటిని అధిగమిస్తూ మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రం మంచి విజయం సాధించడంతో మెగాభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక తాజాగా విడుదలైన రామ్‌చరణ్ 'రంగస్థలం' చిత్రం వారి వేసవి దాహాన్ని పూర్తిగా తీరుస్తోంది. ఈ చిత్రంలో సుకుమార్ రామ్‌చరణ్‌లోని పరిపూర్ణ నటుడిని బయటకు తెచ్చాడని, ఇంతకాలం ఇంటెలిజెంట్ చిత్రాల వెంటపడిన సుకుమార్ అందరికీ నచ్చే మాస్ అంశాలతో సులభతరంగా ఉండే స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో నిరూపించాడు. ఈ చిత్రం మొదటి రోజునే 40కోట్లను క్రాస్ చేసింది. ఇక ఓవర్‌సీస్‌లో కూడా రెండు మిలియన్లు దాటింది. ఇక ఈ చిత్రానికి రామ్‌చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ఇతర సినీ ప్రముఖులు, బంధుమిత్రులు, చరణ్ కుటుంబసభ్యుల నుంచి విపరీతమైన ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక ఆఫ్‌ది స్క్రీన్‌లో ఘట్టమనేని వారసుడు మహేష్‌బాబు కుటుంబానికి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. మహేష్ విదేశాలలో వెకేషన్‌లో ఉన్న సందర్భంగా కూడా రామ్‌చరణ్, ఉపాసన అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇక తాజాగా 'రంగస్థలం' చిత్రం చూసిన వెంటనే మహేష్‌బాబు సుకుమార్‌కి ప్రమోషన్స్ హడావుడి తగ్గిన తర్వాత కొన్నిరోజుల్లో పర్సనల్‌గా కలుద్దామని మెసేజ్ ఇచ్చాడని తెలుస్తోంది. సుకుమార్ తీసిన '1' (నేనొక్కడినే) చిత్రం బాగా ఆడకపోయినా కూడా ఈ చిత్రం మహేష్ అభిమానులను మెప్పించింది. సో... త్వరలో మహేష్ సుకుమార్‌తో మరో చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక 'రంగస్థలం' చూసి మహేష్ దంపతులు ఎంతో ఆనందపడ్డారు. వెంటనే మహేష్ 'భరత్ అనే నేను' చిత్రం విషయంలో బిజీగా ఉండటంతో ఆయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్ చరణ్‌ని కలిసి ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గిఫ్ట్ ఇస్తున్న ఫొటో ఉంది గానీ ఆ గిఫ్ట్ ఏమిటి? అనేది మాత్రం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. మరి ఈ విషయంలో ఎవరైనా స్పందిస్తేనే విషయం తెలుస్తుంది. మొత్తానికి మెగా పవర్‌స్టార్‌కి సూపర్‌స్టార్ కుటుంబం ఇచ్చిన గిఫ్ట్ మాత్రం ప్రత్యేకమైనదేనని చెప్పాలి.