చిరంజీవి తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు 'రుద్రవీణ, ఆరాధన, స్వయంకృషి, ఆపద్బాంధవుడు' వంటి చిత్రాలలో తన నటనా విశ్వరూపం చూపించాడు. ఈ చిత్రాలు ఆయనకు మంచి పేరైతే తెచ్చాయి గానీ కమర్షియల్ విజయాలను అందించలేకపోయాయి. దాంతో ఇక తాను అలాంటి చిత్రాలు చేయనని, నిర్మాతలు బాగా ఆర్ధికంగా లాభం పొందేలా, తన నుంచి ప్రేక్షకులు ఆశించే చిత్రాలు చేస్తూ వచ్చాడు. కానీ రామ్‌చరణ్ మాత్రం ఈ విషయంలో తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకున్నాడు. 'ధృవ' తర్వాత కేవలం తన బ్రాండ్ యాక్టింగ్‌తో ఆయన తనలోని నటనా విశ్వరూపాన్ని చూపించాడు. ఈ విధంగా ప్రయోగం చేస్తూనే, ప్రయోగాన్ని కూడా కమర్షియల్ హిట్‌గా మార్చడంలో ఈ యూనిట్ విజయం సాధించింది. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు సౌండ్‌కి బాక్సాఫీస్‌లు బద్దలు అవుతున్నాయి. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. తెలుగువారు ఉన్న చోటల్లా.. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లోని యూఎస్ మార్కెట్‌లో విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రం ఒకే వారం పది రోజుల్లో లాభాల బాట పట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం 'మగధీర' కలెక్షన్లు అయిన 80కోట్లను ఈజీగా సాధిస్తుందని, ప్రస్తుతం వస్తున్న పాజిటివ్ టాక్‌ని బట్టి చూస్తే ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమంటున్నారు.
ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన 'మైత్రిమూవీమేకర్స్' సంస్థ నిర్మించిన 'శ్రీమంతుడు' మహేష్ కెరీర్‌లో భారీ విజయం. ఇక 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఎన్టీఆర్ చిత్రాలన్నింటిలోకి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. అలాగే 'రంగస్థలం' కూడా రామ్‌చరణ్‌కి కెరీర్‌లోనే గొప్ప హిట్‌గా నిలవడం గ్యారంటీ అంటున్నారు. దాంతో చిరంజీవి ఎంతో ఆనందంగా ఉన్నాడు. తాను ప్రీరిలీజ్ వేడుకలో చెప్పిందే నిజమైందని ఆయనతో పాటు మెగాభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు. చిట్టిబాబు పాత్రకి రామ్‌చరణ్ ప్రాణప్రతిష్ట చేశాడని, చరణ్‌లోని పూర్తి నటుడిని ఆవిష్కరింపజేసి, ఆయన నట విశ్వరూపాన్ని చూపించిన చిత్రంగా మెగాభిమానులు సందడి చేస్తున్నారు. ఇక ఈ వారం రామ్‌చరణ్ 'రంగస్థలం' ఓ ఊపు ఊపితే వచ్చే వారం పవన్ నిర్మాతగా రానున్న నితిన్ 'ఛల్ మోహన్ రంగ' ద్వారా రికార్డు సృష్టించడం ఖాయమని మెగాభిమానులు అంటున్నారు. మొత్తానికి వేసవికి సరైన చిత్రం ద్వారా ఆహ్వానం పలకడం శుభశూచకంగా చెప్పాలి.