మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహం అనుభవిస్తున్నాడు. పుత్రుడు జన్మించినప్పుడు కాదు.. ఆ కొడుకు ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం అనేది తెలిసిందే. ఇక ఎవరు అవునన్నా కాదన్నా ఇంత కాలం రామ్‌చరణ్ కేవలం మాస్ జపం, చిరు ఇమేజ్‌తో హిట్స్‌కొట్టాడు. 'మగధీర' చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసినా కూడా అధికశాతం క్రెడిట్ రాజమౌళి ఖాతాలో పడిపోయింది. కాస్త ప్రయోగం చేద్దామని చూసిన 'ఆరెంజ్' దెబ్బతీసింది. ఇక అక్కడ నుంచి రామ్‌చరణ్ మాస్ జపం ఎత్తుకున్నాడు. కేవలం మాస్, యాక్షన్ ఓరియటెండ్ పాత్రలే చేస్తూ వచ్చాడు. కానీ 'ధృవ'తో కొత్తదనం చూపించాడు. కానీ ఇది కూడా పెద్దనోట్ల రద్దు సమయంలో రావడం, 'తని ఒరువన్'కి రీమేక్ కావడంతో చరణ్ ఖాతాలో పూర్తి స్థాయి విజయం చోటుచేసుకోలేదు. అదంతా రామ్‌చరణ్ ఒకేఒక్క 'రంగస్థలం'తో బాకీ తీర్చేశాడు. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు, పాజిటివ్ టాక్, ఏకంగా రామ్‌చరణ్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వస్తుందనేంతగా ప్రచారం సాగుతుండటంతో రామ్‌చరణ్ కెరీర్‌లో ఇది నా చిత్రం. నేను సొంతగా నిలబడి సాధించిన విజయం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఇది ఉంది. చివరకు సుకుమార్ టేకింగ్ కంటే చరణ్ నటన గురించే అందరు మాట్లాడుకుంటుండటం విశేషం. ఇక ఈ చిత్రం గురించి సుకుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రం విజయం రామ్‌చరణ్‌కే దక్కుతుంది... అని చెప్పుకొచ్చాడు. ఓ కథను తయారు చేసి దానిని దృశ్యకావ్యంగా మలచడంతో సుకుమార్ నేర్పరి.
ఇక ఈయన మాట్లాడుతూ, ఈ చిత్రం కథను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకున్నాను. కానీ చిట్టిబాబు పాత్ర చెవిటి వాడి పాత్ర కావడంతో దాని గురించి మాత్రం చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఇక పల్లెటూరి నేపధ్యాలను, అక్కడి వాతావరణాన్ని, మనుషులు ప్రవర్తనను ఎంతగానో పరిశీలించాను. ఇక ఈ చిత్రం తర్వాత నేను చిరంజీవి గారి వద్దకు వెళ్లితే ఆయన గట్టిగా కౌగిలించుకుని అభినందించారు. అంతకు మించిన అదృష్టం, తృప్తి కన్నా ఇంకేం కావాలి? అని తెలిపాడు. ఇక ఈ చిత్రం విజయాన్ని సుకుమార్, చరణ్‌లు, చిరంజీవితో కలిసి జరుపుకున్నారు. ఇందులో దర్శకులు వంశీ పైడిపల్లి, 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఉన్నారు. ఇక వంశీపైడిపల్లి ఆల్‌రెడీ చరణ్‌తో 'ఎవడు' చిత్రం చేశాడు. మహేష్ 25వ చిత్రం తర్వాత ఆయన చరణ్‌తో ఓ చిత్రం చేయనున్నాడని, ఇక 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా చరణ్ కోసం ఓ లైన్‌ని చెప్పి చిరు, చరణ్‌ల వద్ద ఓకే చేయించుకున్నాడని, చరణ్ వీలుని బట్టి ఈ చిత్రం కూడా పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు.