ఇటీవలే బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని ప్రారంభించాడు. ఈ చిత్రం ఓపెనింగ్ షాట్‌ని 'దాన వీర శూర కర్ణ'లోని సన్నివేశాన్ని మొదటి షాట్‌గా చిత్రీకరించారు. ధుర్యోధనుని గెటప్‌లో వచ్చిన బాలయ్య మీసం తిప్పుతూ స్వైర విహారం చేశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. అంతలోనే బాలయ్య ఈసారి శ్రీకృష్ణ దేవరాయలు గెటప్‌లో దర్శనమిచ్చాడు. గతంలో బాలకృష్ణ , సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'లో కూడా శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించారు. ఇప్పుడు ఆయన అనంతపురంలోని లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఓ ప్రత్యేక రథంలో, శ్రీకృష్ణదేవరాయలు గెటప్ వేసుకుని వచ్చి ప్రసంగించారు. ఇక ఈ వేడుకకు సీఎం చంద్రబాబుతో పాటు పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ ఉత్సావాలలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు జరిగాయి.
ఇక ఇందులో ఆధ్యాత్మిక ప్రదర్శనలు కూడా ఉంటాయని అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తెలిపాడు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన బాలయ్య, రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన కృషితో అభివృద్ది వైపు పరుగులు తీయిస్తున్నారని, ఆనాడు తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాపాడటనికి కృషి చేశారని, దాని కోసమే ఆయన పోరాటం సాగించారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే రీతిలో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారని తెలిపాడు. ఈ వేడుకకు హాజరైన కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావులను ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణలు సత్కరించారు. అయినా ఇలా రాజకీయ వేషాలు నాడు ఎన్టీఆర్ వేశాడు. సన్యాసం అంటూ కాషాయ గుడ్డలు, వివేకానందుడి గెటప్‌లు కూడా వేశారు. ఇప్పుడు బాలయ్య కూడా అదే రూట్‌లో వెళ్తుండటం విశేషం.