తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలన్నీ షూటింగ్‌లు, రిలీజ్‌లకు వ్యతిరేకంగా బంద్‌ని పాటిస్తున్నాయి సర్వీస్ ప్రొవైడర్లతో పాటు పలు సమస్యలపై సినీ పరిశ్రమ పెద్దలు కన్నెర్ర జేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం మన నిర్మాతలు ఏమాత్రం ప్రతిఘటన చేయకుండానే వారితో రాజీపడి సమ్మెకి చరమగీతం పాడారు. కానీ తమిళ తంబీలు మాత్రం ఇంకా బంద్‌ని కొనసాగిస్తూనే ఉన్నారు. రజనీకాంత్ నటించి వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న 'కాలా' చిత్రానికి కూడా రిలీజ్ విషయంలో జాప్యం తప్పనిసరిగా మారుతోంది. అదే మనవారైతే ఓ స్టార్ హీరో చిత్రం వస్తోందంటే చాలు ఇక సమ్మెలలో రాజీపడి యధాప్రకారం అన్ని మర్చిపోతారు. కానీ తమిళ తంబీలు మాత్రం ఈ బంద్‌ని అప్రకటితంగా సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ వివాదంలోకి నయనతార వచ్చి చేరింది. ఆమె మలయాళంలో 'పుదియ నియమమ్' అనే చిత్రంలో నటించింది. దానిని ఓ తమిళ ప్రొడ్యూసర్ 'వాసుకి' పేరుతో డబ్బింగ్ చేసి, నిన్ననే విడుదల చేశాడు. దాంతో తమిళనాట కోలీవుడ్ ప్రముఖులందరు దీనిని ఖండిస్తున్నారు.
తమకు ఓ న్యాయం, నయనతారకి ఓ న్యాయమా? అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు తమ చిత్రాలను వాయిదా వేసుకుని బంద్‌కి సహకరిస్తూ ఉంటే.. నయనతార డబ్బింగ్ చిత్రం మాత్రం ఎలా విడుదల అవుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నయనతార ఈ విషయంపై స్పందించింది. నేను ఆ మలయాళ చిత్రంలో నటించడమే తప్పా? అసలు ఆ చిత్రాన్ని ఏ నిర్మాత కొనుక్కుని డబ్ చేసి విడుదల చేశాడో కూడా నాకు తెలియదు. ఈ విషయంలో నా తప్పేం లేదు. ఆ నిర్మాత సినిమాని ఈ సమయంలో రిలీజ్ చేయడం ఆయన తప్పు. ఆయన చేసిన తప్పుకి నన్ను బలిచేసి, ఏ సంబంధంలేని నాపై ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించింది.