తెలుగులో నిన్నటితరం ప్రేక్షకులకు దర్శకుడు రవిరాజా పినిశెట్టి బాగా పరిచయం. నాడు రీమేక్ చిత్రాలు చేయాలంటే ఆయన తర్వాతే ఎవరైనా, పెదరాయుడు, చంటి వంటి చిత్రాలతో పాటు చిరంజీవితో 'జ్వాల, యముడికి మొగుడు' వంటి పలు చిత్రాలు తీశాడు. ఆయన కుమారుడే ఆది పినిశెట్టి. ఈయన మొదటగా తేజ దర్శకత్వంలో దాసరి నిర్మాతగా వచ్చిన 'ఒక 'వి' చిత్రం' అనే సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయింది. దాంతో ఎవ్వరు ఆయనకు చాన్స్‌లు ఇవ్వలేదు. దాంతో ఆయన కోలీవుడ్ బాట పట్టాడు. అక్కడ 'మృగం', శంకర్ నిర్మించిన 'ఈరం' చిత్రంలో చేశాడు. ఆ తర్వాత కూడా ఆయనకు పలు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, సపోర్టింగ్ పాత్రలు వస్తూ ఉండటంతో వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు. తర్వాత 'గుండెల్లో గోదారి, మలుపు' చిత్రాలతో పాటు అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన 'సరైనోడు' చిత్రంలో వైరం ధనుష్‌గా నటించి బాగా పేరు తెచ్చుకున్నాడు.
ఇక నాని నటించిన 'నిన్నుకోరి'లో మంచి పాత్రను పోషించాడు. సపోర్టింగ్ నటునిగా కూడా తనసత్తా చాటాడు. 'అజ్ఞాతవాసి', తాజాగా విడుదలైన 'రంగస్థలం' చిత్రాలలో తన నటనతో మంచి మెప్పును పొందాడు. ఇలాంటి సమయంలో ఆయన ఓ కీలక నిర్ణయానికి వచ్చాడని సమాచారం. ఇకపై విలన్, సపోర్టింగ్ రోల్స్‌కి నో చెప్పి కేవలం హీరోగానే నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే ఈయన సమంత నటించి నిర్మిస్తున్న 'యూటర్న్', కోనవెంకట్ నిర్మాతగా తాప్సి పన్నుతో చేయబోయే చిత్రాలలో లీడ్ రోల్స్ చేస్తున్నాడు. ఇక నుంచి మాత్రం సోలో హీరోగా నటించి, ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట. అందుకు తగ్గట్లే ఆయనకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. పలువురు నిర్మాతలు ఆయనతో చిత్రాలు తీసేందుకు రెడీగా ఉండగా, పలువురు హీరోయిన్లు కూడా ఆయనతో జతకట్టేందుకు రెడీ అంటున్నారు. సో..ఇక నుంచి ఆది పినిశెట్టిని మనం హీరోగానే చూడగలం....!