ఒకవైపు 'ఎన్టీఆర్' బయోపిక్‌లో బాలకృష్ణ 'దానవీరశూరకర్ణ' చిత్రంలోని ధుర్యోధనుని పాత్రకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హడావుడి చేస్తున్ననేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నప్రతిష్టాత్మక 'సై..రా...నరసింహారెడ్డి'కి చెందిన ఓ ఫొటో కూడా లీక్ అయింది. అయితే ఇది లీక్‌డ్ ఫొటోలా లేదని, యూనిట్ యాదృచ్చికంగానో, కాకతాళీయంగానో ఇది చేయలేదని, కేవలం బాలయ్య హంగామా నుంచి చూపు మరల్చేందుకే చిరంజీవి 'సైరా' పిక్ లీకయిందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇక లీక్ అయిన ఈ ఫొటోలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన భార్య నయనతారతో కలిసి ఓ యాగం చేస్తుండగా, వెనుక వైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి రాజగురువుగా కనిపిస్తూ ఓ పీఠంపై అమితాబ్ కూర్చుని ఉన్నాడు. చిరంజీవి, నయనతారల వెనుక బ్రహ్మాజీ కూడా ఉండటం విశేషం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ ఈ చిత్రం లుక్‌ని రివీల్ చేయకుండా ఆగలేకపోయాడు. ఇవి మెగా కోడలు ఉపాసన కూడా షేర్ చేసుకోవడంతో ఈ పిక్ బాగా వైరల్ అయింది.
ఇక ఈ చిత్రంలో చిరంజీవి కనిపిస్తున్న లుక్ కనిపించింది. రాజు గెటప్‌లో జుట్టును బాగా పెంచి, కాస్ట్యూమ్స్ నుంచి అన్ని 'బాహుబలి'లోని అమరేంద్ర బాహుబలి గెటప్‌లా ఉందని అంటూ ఉంటే.. గతంలో చిరంజీవి హీరోగా హాలీవుడ్ స్థాయిలో సురేష్ కృష్ణతో తీయాలని భావించిన 'బాగ్దాద్ గజదొంగ' చిత్రంలోని చిరంజీవి గెటప్ కూడా ఇలాగే ఉండేదని అభిమానులు అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌లో అమితాబ్, నయనతారలు కూడా కనిపిస్తూ ఉండటంతో ఈ షెడ్యూల్‌లోనే అమితాబ్‌కి సంబంధించిన సీన్స్ అన్నీ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత షెడ్యూల్‌లో మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమవుతోంది. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుని విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రాన్ని మొదట వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో వచ్చే వేసవికి దీనిని బరిలోకి దింపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.