రారండోయ్ వేడుక చూద్దాం హిట్ కొట్టినా.. యుద్ధం శరణంతో భారీ ప్లాప్ చవి చూసిన నాగ చైతన్య ఇపుడు ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే చైతు చేతిలో ఇప్పటివరకు ఓ అదిరిపోయే బ్లాక్ బస్టర్ లేకపోవడంతో ఎలాగైనా ఒక బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని తహతహలాడుతున్నాడు. మీడియం రేంజ్ హీరోగా నాగ చైతన్య మార్కెట్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం చందు మొండేటి, మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న నాగ చైతన్య శివ నిర్వాణం దర్శకత్వంలో సమంత తో కలిసి మరో మూవీలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు చేస్తున్న నాగ చైతన్య మీడియం రేంజ్ నుండి హై బడ్జెట్ హీరోగా మారుతున్నాడనే టాక్ వినబడుతుంది.
ఎందుకంటే చైతు - చందుల సవ్యసాచి సినిమా కి భారీగానే బడ్జెట్ ఎక్కుతుందంటున్నారు. ఇప్పటికే 26 కోట్ల దాకా ఈ సినిమాకి బడ్జెట్ అయ్యిందని.. చైతు కెరీర్ లోనే భారీగా తెరకెక్కుతున్న చిత్రం సవ్యసాచి అంటున్నారు. మరి ప్రస్తుతం 26 కోట్ల బడ్జెట్ ఎక్కింది అంటే... ఇంకా ఈ సినిమా పూర్తయ్యి ప్రమోషన్స్ గట్రా చేపట్టాలి అంటే మరికొంత ఖర్చయ్యే అవకాశం ఉంది. మరి మొత్తం కలిపి 30 దాటినా దాటొచ్చనే టాక్ బయటికి వచ్చింది. అయితే ఎంత బడ్జెట్ అయినా పర్లేదు అనే ఉద్దేశ్యంతో సవ్యసాచి నిర్మాతలు ఉన్నారట. ఎందుకంటే చందు మొండేటి పిక్చరైజేషన్ అంత బాగా ఉందట.
అందుకే నిర్మాతలు ఏం ఆలోచించకుండా ఈ సినిమాకి బడ్జెట్ పెడుతున్నారని.... సినిమా బాగా వస్తుందనే నమ్మకంతో నే వారు ఆలోచనల లేకుండా కోట్లు ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. అలాగే దర్శకుడు చందు మొండేటికి నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేసి బడ్జెట్ విషయంలో ఎలాంటి రెస్టక్షన్స్ పెట్టడం లేదంటున్నారు. మరి ఈ లెక్కన భారీగా తెరకెక్కుతున్న ఈ సవ్యసాచి సినిమా భారీగా నే హిట్ కొట్టాల్సి ఉంటుంది. లేకుంటే పెట్టింది వచ్చే ఛాన్స్ ఉండదు. ఇకపోతే ఆర్ మాధవన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.