దర్శకుడు ఘంటసాల బలరామయ్య మనవడు తమన్ శంకర్ తీసిన 'బాయ్స్' చిత్రం ద్వారా నటునిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడై అతి తక్కువ కాలంలోనే ఆయన అందరు స్టార్స్ చిత్రాలకు, స్టార్ డైర్టెక్టర్లతో పనిచేశాడు. ఇక ఈయన ట్యూన్స్ కంటే బీజీఎం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ మధ్య కాపీ క్యాట్ అనే విమర్శ వల్ల ఆయనకు అవకాశాలు తగ్గాయి. కానీ తాజాగా ఈ ఏడాది మాత్రం ఆయన వరుసగా 'భాగమతి, తొలిప్రేమ' వంటి చిత్రాల ద్వారా తన సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం పవన్, నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు నిర్మాతలుగా నితిన్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'ఛల్ మోహన్ రంగ'ని తీశారు. గతంలో 'రౌడీఫెల్లో' అనే వైవిధ్యభరితమైన చిత్రాన్ని తీసిన కృష్ణచైతన్య దీనికి దర్శకుడు. ఇక ఈ చిత్రంలో నితిన్, మేఘాఆకాష్‌లు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం వేడుక జరిగింది. నితిన్ తన కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 'ఇష్క్' వేడుకకి వచ్చి సినిమా విజయంలో పవన్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా మెగా హీరోల చిత్రాల కంటే ఎక్కువగా నితిన్ చిత్రాల వేడుకలకే పవన్ వస్తున్నాడు.
ఇక 'ఛల్ మోహన్ రంగ'కి పవన్ కూడా నిర్మాత కాబట్టి ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యాడు. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం అదిరిపోతోందని రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా పవన్ ఓ ముఖ్య విషయం చెప్పాడు. 'ఖుషీ' చిత్రం సమయంలో ఓ హిందీ పాటను కంపోజ్ చేయమని తాను మణిశర్మని అడిగానని, అప్పుడు ఆ బాధ్యత మణిశర్మ తమన్‌కి అప్పగించాడు. అలా తమన్ ఇచ్చిన పాటే 'ఏ మేరా జహా'.. ఈ పాట నాడు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఓ తెలుగు చిత్రంలో పూర్తి స్థాయి హిందీ పాటను పెట్టడం ఇదే మొదటిసారి అంటారు. అలా పవన్‌తో తమన్ కూడా పనిచేశాడు. అయితే పవన్ రమణ గోగుల, అనూప్ రూబెన్స్ వంటి వారికి అవకాశం ఇచ్చినా తమన్‌కి ఇప్పటి వరకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం....!