త్వరలో జరగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. దక్షిణాదిపై కేంద్రంలోని బిజెపి సర్కార్ చిన్నచూపు చూస్తోందని కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలన్ని బిజెపి, మోదీపై గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో దక్షిణాదిన బిజెపికి కాస్తబలం ఉన్న రాష్ట్రం కేవలం కర్ణాటకనే. ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే మరలా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బిజెపి, మోదీలు గెలవడం ఖాయంగా చెప్పవచ్చు. అదే కర్ణాటకలో బిజెపికి దెబ్బతగిలితే మరలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంచుకుంటోందనే నిర్ణయానికి రావచ్చు. ఆ విధంగా చూసుకుంటే మరో ఏడాదిలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీఫైనల్స్‌గా చెప్పవచ్చు. ఇక ఇప్పటికే కర్ణాటకలో బిజెపి మాజీసీఎం యడ్యూరప్ప, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఉపేంద్ర సొంతగా పార్టీ పెట్టినా దానిని కూడా ఎన్నికల నాటికి బిజెపికి మద్దతు గానో, లేక బిజెపిలో విలీనం చేయడమో చేస్తాడని పలువురు భావిస్తున్నారు. ఇక ప్రకాష్‌రాజ్ అయితే కాంగ్రెస్ ప్రోత్సాహంతో బిజెపిపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నాడు.
ఇక అంబరీష్ నుంచి ఎందరో కన్నడ నటులు రాజకీయాలలోఉన్నారు. 'దండుపాళ్యం' ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి పూజాగాంధీ. ఈమె గతంలో జనతాదల్ సెక్యులర్ అంటే జనతాదళ్ ఎస్, జనతా పక్ష పార్టీలలో చేరారు. తర్వాత బిఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాయచూర్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఇక ఈమె ఈసారి బిజెపిలో చేరాలని భావిస్తోంది. కానీ ఆ పార్టీలోని కొందరు సీనియర్లు ఆమెని పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదని, ఆమె పలు పార్టీలు మారుతున్న నేపధ్యంలో అది బిజెపికి చెడ్డపేరు తెస్తుందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె బిజెపిలో చేరితే పార్టీకి సినీ గ్లామర్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెని బిజెపిలో చేరడాన్ని వ్యతిరేకించే వారితో ఆ పార్టీ సీనియర్లు మాట్లాడుతూ, ఆమె విషయంలో వారిని ఒప్పించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి ఈమెని బిజెపిలో చేర్చుకుని టికెట్ ఇస్తారో లేదో వేచిచూడాల్సివుంది..!