నిజానికి చిరంజీవిలో కేవలం మాస్, యాక్షన్ చిత్రాల నటుడే కాదు.. 'పున్నమినాగు, మంచు పల్లకి నుంచి విజేత, చంటబ్బాయ్, మగమహారాజు, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, డాడీ, ఇద్దరు మిత్రులు, మంజునాథ, రుద్రవీణ, ఆరాధన' చిత్రాల ద్వారా ఎంతో గొప్పనటుడు దాగి ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం వల్ల దాని నుంచి బయటపడలేకపోయాడు. ఇక ఆయన అభిమానులు కూడా చిరుని కేవలం మాస్, యాక్షన్, స్టెప్స్, ఫైట్స్ బాగా చేసే నటునిగా, వాటిని ఆరాధించే వారిగా మారడంతో ఆయనలోని అసలైన నటుడిని మాత్రం గుర్తించలేక పోయారు. ఇక ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ది కూడా అదే పరిస్థితి. ఆయనలోని నటుడు తన రెండో చిత్రం 'మగధీర'తోనే బయటికి వచ్చాడు. తర్వాత 'ఆరెంజ్' చిత్రం ఫ్లాప్ అయినా చరణ్‌లోని నటుడిని ఈ చిత్రం ఆవిష్కరించింది. కానీ ఆయన కూడా తన తండ్రి బాటలో మాస్, యాక్షన్‌తో అవే రొటీన్ చిత్రాలు చేస్తుండటంతో వరుస పరాజయాలు పలకరించాయి. ఆ తర్వాత ఎంతో కాలానికి గానీ ఈయన 'ధృవ' ద్వారా కొత్త ప్రయోగం చేయలేదు. ఇక త్వరలో రానున్న 'రంగస్థలం 1985' చిత్రమైతే చరణ్‌లోని నటుడిగా ఆయన విశ్వరూపాన్ని చూపిస్తుందని యూనిట్ వారు నమ్మకంగా చెబుతున్నారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మొదట్లో కొన్ని విషయాలలో అడ్డంకులు చెప్పిన చిరంజీవి సైతం సుకుమార్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడట.
ఇక ఈ చిత్రం విడుదలైతే రామ్‌చరణ్‌కి సహజ నటుడు అనే పేరు రావడం గ్యారంటీ అంటున్నాడు ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేలు. ఇక ఇది ప్రతి హీరో చిత్రం విడుదల సందర్భంగా అందరు చెప్పేదే కదా...! ఎన్టీఆర్, అల్లుఅర్జున్‌ల చిత్రాలు విడుదలయ్యేటప్పుడు కూడా వారిని సహజ నటులని, సింగిల్‌టేక్ ఆర్టిస్టులని పొగడటం మామూలే కదా అని అనిపించవచ్చు. అదే విషయాన్ని రత్నవేలు క్లారిఫై చేస్తూ నేను చిరంజీవి, రజనీకాంత్ వంటి వారి చిత్రాలకు కూడా పనిచేశాను. నాకు ఇప్పుడు ఎవరినో ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదు. ఎవరినో ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నాలేదు. చరణ్ సింగిల్‌టేక్ ఆర్టిస్టు. ఆయన రెండుమూడు టేక్‌ల తర్వాత స్లో అయిపోతాడు. అదే చిరు అయితే ఎన్ని టేకులు తీసుకున్నా కొత్తగా నటిస్తాడు. ఇక వేరేవారు ఒకరోజు పనిచేసినా నేను ఆ చిత్రంలోకి ఎంటర్‌కాను. 'సైరా..' సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ఆ చిత్రానికి ఒక రోజు కూడా పనిచేయలేదు. గతంలో కమల్‌హాసన్ నటించిన 'దశావతారం' చిత్రానికి రెండు మూడు రోజులు ఓ సినిమాటోగ్రాఫర్ చేయడం వల్ల ఆ తర్వాత నాకు చాన్స్ వచ్చినా నేను చేయలేదు...అని తెలిపాడు. ఇక ఈమధ్య వరుసగా రత్నవేలు మెగాహీరోల చిత్రాలు చేస్తున్నాడు. 'ఖైదీనెంబర్150, రంగస్థలం 1985' వీటి తర్వాత 'సై..రా...నరసింహారెడ్డి' వంటి చిత్రాలకు పనిచేస్తున్నాడు.