నాలుగేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే, బిజెపితో మిత్రపక్షంగా మెలిగిన టిడిపి, దాని అధినాయకుడు చంద్రబాబుకి ఇంత కాలానికి ఏపీకి కేంద్రం చేస్తోన్న అన్యాయం గురించి గుర్తుకొచ్చి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. మొదటి నుంచి కేంద్రాన్ని నిలదీయవచ్చు కదా...! అన్న ప్రశ్నకు కేంద్రంతో సయోధ్యగా ఉంటేనే నిధులు వస్తాయని, వారితో తగవు పెట్టుకుంటే ఏమీ రాదని నానాకబుర్లు చెప్పాడు. నిన్నటి బడ్జెట్‌కి ముందు వచ్చిన కేంద్ర బడ్జెట్స్ అన్ని బాగున్నాయని చంద్రబాబే కితాబిచ్చాడు. నోట్లరద్దు నుంచి అన్ని చేయించింది తానేనని చెప్పుకున్నాడు. అసలు ప్రజల్లో ప్రత్యేకహోదా బలంగా ఉందని తెలిసినా కూడా పాచిపోయిన లడ్డులే మాకు చాలు.. ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకప్యాకేజీనే మేలని సెలవిచ్చాడు. జల్లికట్టు స్ఫూర్తి అంటే ఆయన ఆప్తుడు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి దానిని పందుల పోటీతో పోల్చాడు. ఇలా తాము ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనకాల కోసమని, ఇతరులు చేస్తే మాత్రం రాజకీయమని దుయ్యబట్టడం గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తుంది. నిన్నటి వరకు చంద్రబాబు కేంద్రాన్ని ఎలాగైతే గుడ్డిగా నమ్మాడో... పవన్ కూడా ఇంతకాలం చంద్రబాబుని నమ్మాడు. ఇప్పుడు కేంద్రం తప్పు టిడిపికి తెలిసి వచ్చిన విధంగానే ఇంతకాలానికి చంద్రబాబు నిజస్వరూపం పవన్‌కి తెలిసి వచ్చింది అని ఎందుకు అనుకోకూడదు? ఇంతకాలంలో ప్రత్యేకహోదా కోసం కనీసం అఖిలపక్షాన్ని కూడా కేంద్రం వద్దకు తీసుకునిపోని చంద్రబాబు చేసింది మోసం కాదా?
ఇక తాజాగా బాబు బినామిగా పేరున్న, హైదరాబాద్‌లోని హైటెక్, మాదాపూర్‌ల నుంచి అమరావతి వరకు తన ఎంపీ పదవితో రియల్‌ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా చేసుకుంటున్న ఎంపీ మురళీమోహన్ పవన్ జనసేనపై స్పందించాడు. ఏపికి మంచి చేయాలని పవన్ మనసులో ఉంది. కానీ ఆయనకు సరైన అనుభవం లేకపోవడం వల్ల గానీ, ఇతరుల సలహాల వల్ల గానీ ఆయన తొందరపడ్డాడు. చంద్రబాబు వల్లే రాష్ట్రం ఇంత అభివృద్ది చెందిందని, ఆయన వంటి ముఖ్యమంత్రి భవిష్యత్తులో కూడా ఉండాలని పవన్ నాడు కోరుకున్నాడు. అలాంటి ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఆయన యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అంటూ ప్రశ్నించాడు. టిడిపికి తమ నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నట్లే ఇతర నాయకులకు కూడా అలాంటివి ఉంటాయని మురళీమోహన్ ఎందుకు భావించలేకపోతున్నాడు? పవన్ తొందరపాటు వ్యాఖ్యలను ఖండించి మురళీమోహన్ చివరలో మాత్రం పవన్‌ని తానేమీ విమర్శించడం లేదని, ఆయన్ను విమర్శిస్తే తమని తాము విమర్శించుకున్నట్లే అవుతుందనే విషయాన్ని మాత్రం ఎంతో హుందాగా చెప్పుకొచ్చాడు.