పరభాషా నటులు తెలుగు రాజకీయాలలోకి రావాలని కలలు కంటున్నారు. వాణివిశ్వనాథ్ టిడిపిలో చేరేందుకు నానాయత్నాలు చేస్తోంది. కవిత టిడిపికి బై చెప్పి బిజెపి కండువా కప్పుకుంది. ఇక తాను తెలంగాణ వ్యక్తినని చెప్పుకున్న రాములమ్మ విజయశాంతినే కేసీఆర్ పట్టించుకోలేదు. ఎవరెన్ని చెప్పిన ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో పరిస్థితులను, అవసరాలను సద్వినియోగం చేసుకుని వాటిని ఓట్లుగా మలుచుకోవడంతో కేసీఆర్ మహా నేర్పరి. అందుకే ఆయనపై ఎంత వ్యతిరేకత ఉన్న కూడా వచ్చే ఎన్నికల్లో మరలా ఆయనే గెలుస్తాడంటూ ప్రజలు అంటున్నారు. విశ్లేషకులు నిజమేనని తేలుస్తున్నారు. ఏపీలో టిడిపి వస్తుందో లేదో తెలియదు గానీ తెలంగాణలో టిఆర్‌ఎస్ గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. ఇక కర్ణాటకలోని మంగళూరుకి చెందిన తుళు వ్యక్తి అయిన ఒక నాటి హీరో, ప్రస్తుతం సపోర్టింగ్ యాక్టర్ సుమన్ ఏపీ రాజకీయాలను కాదని, తెలంగాణ వైపు నుంచి గాలం వేస్తున్నాడు. సుమన్‌కి నేడు ఎవరూ పర్సనల్ అభిమానుల అండ లేదు. ఆయన కెరీరే అయోమయంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సుమన్ తనకి రాజకీయాలలోకి రావాలని ఉందని, కేసీఆర్ ఆహ్వానిస్తే టిఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించాడు.
ఇక కేసీఆర్ గౌడ కులస్థులకు ఎంతో చేశాడని, కాబట్టి ఈ సామాజిక వర్గం మొత్తం కేసీఆర్‌కి మద్దతు తెలపాలని, గౌడులకు ఇంత చేసినందుకు కేసీఆర్ కాళ్లు మొక్కాలని ఆయన అన్నారు. ఆ చేరేదేదో మొహమాటం లేకుండా టిఆర్‌ఎస్‌లో చేరిపోకుండా మధ్యలో కేేసీఆర్ ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరుతానని సుమన్ చెప్పడం మాత్రం జోకే. ప్రస్తుతం సుమన్ ఉన్నపరిస్థితుల్లో ఆయన అవసరం టిఆర్‌ఎస్‌కి లేదు. రాజకీయాలలో అవసరమే కీలక పాత్రను పోషిస్తుంది. అవసరమైతే వారే ఆహ్వానిస్తారు. రాజకీయాలు వద్దు మొర్రో అన్నా కూడా పిలిచి సీటు ఇస్తారు. అవసరమైతే పవన్‌కళ్యాణ్ వంటి వారిని పొగుడుతారు మచ్చిక చేసుకుంటారు. కానీ సుమన్ వంటి నటుడి అవసరం కేసీఆర్‌కి లేదు కాబట్టి ఆయన ఆహ్వానించాలని కండీషన్ పెట్టడం సుమన్ అజ్ఞానం. రాజకీయాలలోకి వెళ్లాలని ఉంటే, అంతగా టిఆర్‌ఎస్‌పై ఇష్టం ఉంటే ఈయనే నేరుగా వెళ్లి కేసీఆర్ ఆశీస్సులు తీసుకోవడమే తెలివైన పని.