సుకుమార్‌కి మరో జక్కన్న అనే పేరుంది. ఈయన ఏళ్లపాటు చిత్రాన్ని చెక్కుతూనే ఉంటాడు. ఇలాగే 'రంగస్థలం 1985' చిత్రాన్ని కూడా ఎప్పటినుంచో చెక్కుతూ వస్తున్నాడు. దసరా, సంక్రాంతి పండగలకు అనుకున్న చిత్రం ఎట్టకేలకు ఈ నెల 30 వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం కథ విన్నప్పుడు, మొదట రషెష్ చూసినప్పుడు రామ్‌చరణ్‌కి ఇది సరైన సబ్జెక్ట్ కాదని చిరంజీవి భావించాడని, పలు మార్పులు చేర్పులు చెప్పాడని వార్తలు వచ్చాయి. కానీ తండ్రి మాటను ఎప్పుడు జవదాటని రామ్‌చరణ్ ఈ ఒక్క చిత్రం విషయం తనకి వదిలేయాలని, సుకుమార్‌పై తనకి ఎంతో నమ్మకం ఉందని, ఆయన చెప్పినట్లే చేద్దామని తన తండ్రిని ఒప్పించాడని కూడా అన్నారు. ఇక 1980ల కాలం నాటి గ్రామీణ వాతావరణం నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఎంతో కాలం తర్వాత ఓ స్టార్ పూర్తి గ్రామీణ నేపధ్యంలో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ ఫస్ట్ కాపీని చూసిన చిరంజీవి ఇందులో రామ్‌చరణ్‌ని సుకుమార్ చూపించిన విధానానికి ముగ్డుదయ్యాడట. దాంతో సుక్కుని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసల వర్షం కురిపించాడని అంటున్నారు.
దీంతో మెగాస్టార్ చిరంజీవి తన 151వ ప్రతిష్టాత్మక చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో కొణిదెల బేనర్‌లోనే ఓ చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. సుకుమార్ కూడా మెగాస్టార్‌కి స్టోరీ కూడా వినిపించాడని ఆ మాటల సారాంశం. అయినా 'సై..రా...' పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో ఎవ్వరు చెప్పలేరు. అలాంటి సమయంలో చిరంజీవి కోసం అంతకాలం సుకుమార్ వెయిట్ చేస్తాడని కూడా భావించలేం. ఇక ఈ విషయంపై ఎట్టకేలకు సుకుమార్ స్పందించాడు. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఇక నాకు చిరంజీవి గారితో సినిమా చేయడం కల. కానీ ఇప్పటివరకు నేను చిరంజీవి గారి కోసం కథ రెడీ చేయడం, చిరుగారికి వినిపించడం జరగలేదు. ఇవన్నీ ఉత్త పుకార్లని తోసిపుచ్చాడు. దీంతో ఈ విషయంపై సుకుమార్ నుంచి క్లారిటీ వచ్చింది. ఇక సుకుమార్ తన తదుపరి చిత్రంగా అల్లుఅర్జున్‌తో 'ఆర్య, ఆర్య 2' తర్వాత మరో చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి వాటిల్లో అయినా నిజం ఉందో లేదో చూడాల్సివుంది...!