ఏపీ రాజకీయాలలో ఏర్పడుతున్న పరిణామాలపై మరోసారి జనసేనాని పవన్‌కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు. అమిత్‌షా చంద్రబాబునాయుడుకి లేఖ రాయడం, దానిపై చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన నేపధ్యంలో పవన్ దీనిపై స్పందించాడు. అమిత్ షా ఎప్పటిమాదిరే ఏపీకి వేల కోట్లు ఇచ్చామని, వాటిని టిడిపి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించడం, చంద్రబాబు బిజెపి ఏపీని మోసం చేసిందని పాట పాడటంతో మామూలైపోయిందని పవన్ మండిపడ్డాడు. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? కేంద్రం రాష్ట్రానికి ఎంతిచ్చింది? రాష్ట్రం కేంద్రం నుంచి ఎంత వచ్చింది? ఎలా ఖర్చు చేసింది? వంటి విషయాలను అధికారులతో కమిటీ వేసి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని పవన్ ప్రశ్నించాడు. ఇక తాము ఆల్‌రెడీ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలో ఈ విషయంపై చర్చించామని, దాని ప్రకారం దానిని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని పవన్ మండిపడ్డాడు.
అమిత్‌షా లేఖ చూస్తుంటే ఏపీకి ప్రత్యేకహోదాని బిజెపి ఇచ్చే అవకాశమే లేదని అనిపిస్తోందని, మరోవైపు తెలుగు దేశం కూడా ఏపీకి ప్రత్యేకహోదా తెచ్చే సత్తా తనలో లేదని రుజువైందని పవన్ అన్నారు. ప్రజలు ప్రత్యేకహోదా తప్ప మరే విషయాన్ని వినే పరిస్థితుల్లో లేరని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన కోరాడు. విసిగి వేసారి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి దాకా తీసుకురావద్దని ఆయన ఇరు ప్రభుత్వాలను కోరారు. ఏపీలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిపై చర్చించేందుకు త్వరలో వామపక్ష నాయకులతో కలిసి మాట్లాడబోతున్నానని, ఆ తర్వాత మేధావులు, రాజకీయ అనుభవం కలిగిన జయప్రకాష్‌నారాయణ్ వంటి వారితో కూడా సంప్రదింపులు జరిపి, తర్వాత ప్రజాభీష్టం మేరకు ఏమి చేయాలి? అనే విషయంలో ఏ క్లారిటీకి వస్తామని ఆయన అన్యాపదేశంగా నిరాహార దీక్ష గురించి ప్రస్తావించాడని విశ్లేషకులు భావిస్తున్నారు.