కథ బాగుంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు నటీనటులు ఎవరు? ఏ భాషా చిత్రం అని కూడా ఆలోచించకుండా ఆదరిస్తారు. దానికి ఆ మధ్య 'బ్రహ్మూెత్సవం' సమయంలో వచ్చిన 'బిచ్చగాడు' చిత్రమే ఉదాహరణ. ఈ చిన్న డబ్బింగ్ చిత్రం ఇండస్ట్రీ లెక్కలని తిరగరాసింది. ఇందులో నటించిన విజయ్ ఆంటోనికి ఎక్కడ లేని గుర్తింపును తెచ్చింది. కానీ ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన 'భేతాళుడు, యమన్, ఇంద్రసేన' వంటి చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ సమయంలో విజయ్ ఆంటోని తన భార్య ఫాతిమా ఆంటోని నిర్మాతగా ఉదయనిధి దర్శకత్వంలో తమిళంలో 'కాళి' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో 'కాశి'గా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇది కూడా తల్లి సెంటిమెంట్‌తో ఉంది. అలాగే యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో పాటు పునర్జన్మ నేపధ్యం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఈ చిత్రం ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటున్నా చివరలో కాస్త నిరాశ పరిచింది. అంజలి, సునయన పాత్రలు కీలకమైనవిగా కనిపిస్తున్నాయి. ఈయన ఈ ట్రైలర్‌లో సరికొత్త గెటప్పులలో కనిపిస్తున్నాడు. 'బిచ్చగాడు' తర్వాత స్ట్రెయిట్‌గా ఆయనే హీరోగా తెలుగులోనే చిత్రం తీసేంతగా నిర్మాతలు, బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ వరుస చిత్రాలు నిరాశపరిచాయి. అయినా ఆయన సినిమా కమర్షియల్‌గా హిట్ అయినా కాకపోయినా అభిరుచి, వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తాడనే నమ్మకం ఇప్పటికీ తెలుగు ఆడియన్స్‌కి ఉంది. మరి ఈ చిత్రం ద్వారా ఆయన హిట్ కొడితే మరో 'బిచ్చగాడు' తరహాలో ఆడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే విజయ్ ఆంటోని తెలుగు మనుగడే ఇబ్బందికరంగా మారుతుంది. ఆయన నుంచి ప్రేక్షకులు వైవిధ్యం కోరుకుంటున్నారు. దానిని ఆయన నెరవేరుస్తాడా?