తెలుగులో ఏడిద నాగేశ్వరరావుకి చెందిన పూర్ణోదయాన్ని మించిన అభిరుచి కలిగిన సంస్థ లేదనే చెప్పాలి. ఎవరెవరి పేర్లో, వందల చిత్రాలుతీశారు..ఎన్నో చిత్రాలు తీశారనే రికార్డులు గురించి చెప్పుకోవడం సమంజసం కాదు. తీసింది ఎన్ని కాదు.. అవి ఎలాంటివి, ఎంత రిస్క్ తీసుకుని నిర్మించాడు అనేదే అసలు పాయింట్. ఈ విషయంలో ఏడిద నాగేశ్వరరావు, కాట్రగడ్డ మురారిలకు పోటీ వచ్చే వారే లేరు. కానీ వీరు సినిమాలు తీసేటప్పుడు ఎందరో సినీ జనాలు వారి సినిమాలను విమర్శిస్తూ వ్యంగ్యంగా స్పందించిన వారే. ఏడిద నాగేశ్వరరావు ఓ డప్పు కొట్టుకునే వాడు హీరో, ఓ మూగమ్మాయి హీరోయిన్‌గా 'సిరిసిరిమువ్వ' తీసే సమయంలో చివరకి ఏడిదకి మిగిలేది 'సిరి' కాదు.. 'మువ్వలే' అని విమర్శించిన వారు ఎందరో ఉన్నారు. ఇక 'తాయారమ్మ బంగారయ్య' చిత్రం తీసేటప్పుడు ముసలి వారితో సినిమా ఏంటి? అన్నారు. 'శంకరాభరణం' సమయంలో కూడా ఎన్నో వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు వచ్చాయి. కానీ ఏడిద నాగేశ్వరరావు తన అభిరుచి, కథపై ఉన్న నమ్మకంతో తాను తీసిన ప్రతి చిత్రాన్ని కళాఖండంగా మార్చారు. ఇక ఈ కొత్త సినిమా పోకడలు నచ్చక ఏకంగా కాట్రగడ్డ మురారి అయితే 'నవ్విపోదురు గాక నాకేంటి' అంటూ పలువురిని దుయ్యబడుతూ ఆత్మకథని రాశాడు. ఎమ్మెస్‌రెడ్డి సైతం అదే పని చేసి, చివరకు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒత్తిడులు తట్టుకోలేక ఆ పుస్తకాన్ని రద్దు చేసుకున్నాడు.
ఇక ఏడిద నాగేశ్వరరావుపై కొందరు ఆయన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌కి సరిగా పేమెంట్స్ ఇవ్వరు అనే ముద్ర వేశారు. కానీ ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. చిన్న కళాకారులు, పనివారికి వెంటనే డబ్బులు ఇచ్చేసేవాడు. కానీ పెద్ద వారికి మాత్రం సినిమా విడుదలకు ముందు ఇస్తానని చెప్పేవాడు. సినిమా విడుదలకు ముందు ఆయన ముందుగా ఎంత ఒప్పుకున్నాడో అంత పేమెంట్‌ని పూర్తిగా ఇచ్చేసేవాడు. అలాంటి నిర్మాతలపై ఇలాంటి పుకార్లు రావడం శోచనీయం. ఇక ఈయన కుమారుడు ఏడిద శ్రీరాం 'సీతాకోకచిలుక' చిత్రంలో కార్తీక్ ఫ్రెండ్స్‌లో ఒకడిగా, అలీతో కలిసి నటించాడు. ఆయన హీరోగా తన తండ్రి నిర్మాతగా 'స్వరకల్పన' చిత్రం వచ్చింది. ఈ చిత్రంపై ఏడిద నాగేశ్వరరావు, ఏడిద శ్రీరాం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయింది. దాంతో ఏడిద శ్రీరాం తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లి ఇంట్లోంచి బయటికి వచ్చేవాడు కాదు. దాంతో చిరంజీవికి విషయం తెలిసి ఆయనను పిలిపించి, ఫ్లాప్స్ సహజం. నాకు మాత్రం ఎన్ని ఫ్లాప్‌లు రాలేదు. పరాజయాలు ఎదురైనప్పుడు వాటిని చాలెంజ్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలి. త్వరలో శాటిలైట్ చానెల్స్ కూడా వస్తున్నాయట. అది నీకు మంచి అవకాశం అవుతుందని ప్రోత్సహించాడట. అనుకున్నట్లే టీవీలు వచ్చిన తర్వాత ఏడిద శ్రీరాం టీవీ నటునిగా బిజీ అయ్యాడు. ఈయనని ఇప్పటికీ జూనియర్ రాజేంద్రప్రసాద్ అని పిలవడం గమనార్హం.