హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ ద్రవిడ, ఆపరేషన్ రావణ, ఆపరేషన్ కుమార వంటివి సినిమాలలో ఉంటాయే గానీ నిజ రాజకీయాలలో ఉండవని ఉండవల్లి అరుణ్‌కుమార్ తేల్చిచెప్పాడు. డబ్బులు పెట్టి రాజకీయ పార్టీలు ఆపరేషన్స్ నిర్వహిస్తాయని తాము భావించడం లేదని, అలాగైతే దేశ బడ్జెట్‌కి సమానమైన డబ్బున్న అంబానీలు, బిర్లాలు ఏనాడో రాజకీయాలలోకి వచ్చేవారని ఆయన విశ్లేషించాడు. అయితే శివాజీకి అనుభవం లేకనే అలా మాట్లాడి ఉంటాడని, ఆ కళ్యాణ్‌జీ అనే వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి ఆయన ఇలా చెప్పి ఉంటాడని, ఇందులో శివాజీ తప్పేమీ లేదని ఉండవల్లి తేల్చిచెప్పాడు. ప్రతి పార్టీకి అన్ని రాష్ట్రాలలో పాగా వేయాలని ఉంటుందని, అంత మాత్రాన ఆపరేషన్లు చేయరని, మన దేశంలోని ప్రజాస్వామ్యంలో ప్రజలే ఓట్లు వేస్తారని, అంతేగానీ ఆపరేషన్స్ కాదు. మహా అయితే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు మాత్రమే వ్యూహాలు పన్నుతాయి. ఇక 2014లో స్పీకర్ పోడియం వద్ద వందమంది ఎంపీలు గుమికూడి ఆందోళన చేసినా, నాడు స్పీకర్ దానిని లెక్క చేయకుండా సభ్యుల మద్దతు ఎవరికో తెలిపే విధంగా తీసుకున్నారని, మరి అలాంటిది కేవలం 20, 25 మంది పోడియం, వెల్ వద్ద ఆందోళన చేస్తున్నంత మాత్రాన లెక్కలని పరిగణనలోకి తీసుకోలేకపోతున్నామని చెప్పడం సరికాదనన్నారు. మంగళవారమైనా ఒక్కరోజు టిడిపి, వైసీపీలు కలిసి పనిచేయాలని, తమ ఎంపీలు 23 మంది స్పీకర్ వద్దకు వెళ్లి తమ అవిశ్వాసాన్ని తెలపాలని, లేదా నాడు 2014లో జరిగింది తప్పు అని ప్రకటించేలా డిమాండ్ చేయాలని ఆయన సూచించారు.
ఇక మంగళవారం కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసం పెడుతున్న నేపధ్యంలో ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మిగిలిన వారి సంగతేమో గానీ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెడితే మాత్రం చర్చ ఖచ్చితంగా సాగుతుందనే నమ్మకంతో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఇప్పటికైనా టిడిపి, వైసీపీలు కాంగ్రెస్ అనే ద్వేషం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తాయా? లేదా? అనేది చూడాలి. ఏపీలోని ఎంపీలు రాజకీయ మనుగడకి, ప్రత్యేకహోదా సెంటిమెంట్‌తో లబ్దిపొందేందుకే నాటకాలు ఆడుతున్నారని, వారికి కావలసింది రాజకీయ లబ్దే గానీ ప్రత్యేకహోదా కాదని పలువురు విశ్లేషకులు ఏపీ ఎంపీలపై మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రధానిని విజయసాయిరెడ్డి కలవడం, ప్రధానిని ద్రోహి, నేరస్తుల అడ్డా అన్నందుకు చంద్రబాబు మీద సభా హక్కుల నోటీస్ ఇస్తామని చెప్పడం చూస్తే వైసీపీ ప్రత్యేకహోదాని కూడా మోదీ వద్ద తాకట్టు పెట్టినట్లే ఉంది.. దీంతో వైసీపీ వ్యవహారం ప్రజల్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది.