ఇటీవల తెలుగుదేశం ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి మద్దతుగా సినిమా ఇండస్ట్రీ ముందుకు రావడం లేదని, రాష్ట్రం నుంచి ప్రేక్షకులు చూసే సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తూ ఏసీ రూమ్‌ల్లో చిందులేస్తున్నారని అసందర్భమైన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక రాఘవేంద్రరావు, సురేష్‌బాబు, రాజమౌళి, బోయపాటి శ్రీను వంటి ఎందరో ఇండస్ట్రీలో చంద్రబాబుకి కావాల్సిన వారు ఉన్నారు. వారు కూడా నోరు విప్పడం లేదు. ఇక ఇప్పటికే మురళీమోహన్, రోజా, శివాజీ, కొరటాల శివ కూడా ప్రత్యేకహోదాపై మండిపడిన విషయం బాబూ రాజేంద్రప్రసాద్‌కి తెలియదేమో....? ఇక ఈ వ్యాఖ్యలపై నిన్నటిదాకా టిడిపిలో ఉండి తాజాగా బిజెపిలో చేరిన సినీ నటి కవిత మండిపడ్డారు. ఆమె కూడా తమ్మారెడ్డి భరద్వాజ, పోసానిల తోవలోనే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నాటకాలు ఆడుతోంది మేము కాదు.. ప్రత్యేకహోదా పేరుతో మీరే నాటకాలు ఆడుతున్నారు. మీ అవినీతి బయటపడుతుందని యూటర్న్ తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా స్పందించేది తెలుగు ఇండస్ట్రీనే, మీ పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ కూడా సినిమావారే అని గుర్తుపెట్టుకోండి....నాడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కూడా జోలె పట్టుకుని తిరిగారు.
ఇక ప్రత్యేకహోదాపై మేము స్పందించడం లేదు. ఏసీ రూమ్‌ల్లో కులుకుతున్నామన్నారు. మరీ మీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా టాప్‌స్టారే కదా..! ఆయనెందుకు స్పందించడం లేదు. ఆయన ఏ ఏసీ రూముల్లో కూర్చుని కులుకుతున్నారు? తెలుగు ఇండస్ట్రీని కేసీఆర్ నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు. కానీ ఏపీ ప్రభుత్వమే పరిశ్రమని పట్టించుకోవడం లేదు. మేము ఇంకా హైదరాబాద్‌లో ఉండి బానిస బతుకులు బతుకుతున్నామని రాజేంద్రప్రసాద్ అంటున్నాడు. మరి నారాలోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు? వారివి కూడా బానిస బతుకులేనా? ఇక రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు కూడా రెండేళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. మరి నాడు ఆయనది కూడా బానిస బతుకేనా? మరి బానిస బతుకు వద్దనుకుని ఆయన వెంటనే హైదరాబాద్ నుంచి వెళ్లిపోయి ఎందుకు ఏపీలో ఉండలేకపోయాడు? అంటూ ప్రశ్నల వర్షంతో బాబూ రాజేంద్రప్రసాద్‌ని కవిత దుమ్ముదులిపేసింది.