తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సాధారణంగా మంచివాక్చాతుర్యం ఉన్నవాడే. కానీ ఆయన సినిమా వారిపై కామెంట్ చేసి లేని పోని తలనొప్పి తెచ్చుకోవడమే కాదు...! తమ అధినాయకుడి నెత్తికి కూడా దీనిని చుట్టాడు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఉన్న సినీ నటులు ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడటం లేదు? వారు ఇలా మద్దతు తెలపకపోతే ఏపీలో జనాలు సినిమాలు చూడరు. అవార్డులు రానప్పుడు నానా యాగీ చేసే వారికి ఇప్పుడు ప్రత్యేకహోదా కనిపించడం లేదా? అని ప్రశ్నించి, సినిమా వారు డబ్బుల మత్తులో జోగుతున్నారని వ్యాఖ్యలు చేశాడు. దానికి ధీటుగా తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణమురళిలు రాజేంద్రప్రసాద్‌ని దుమ్ము దులిపేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌పై పట్టు కోల్పోయింది. ఇక చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు, ఇతర టిడిపి నాయకులు కూడా హోదాపై ఉద్యమం తీవ్రం చేస్తే ఎక్కడ కేంద్రం నుంచి కక్ష్యసాధింపు చర్యలు, ఐటిరైడ్స్ జరుగుతాయని, లేదా ఓటుకు నోటు కేసు ద్వారా మరలా తెర ముందుకు వస్తున్నారని భయపడుతున్నారు.
ఇక 'మెర్శల్'కి మద్దతు తెలిపి, బిజెపిని, జీఎస్టీని విమర్శించిన విశాల్, రాజకీయాలలోకి ప్రవేశించిన కమల్‌హాసన్‌లపై ఐటి దాడులు జరిగాయి. ఇదే పరిస్థితి తమకు కూడా వస్తుందేమో అని సినిమా వారు కూడా మౌనంగా ఉంటున్నారు. సినిమా వారు ఐటిలో తప్పుడు లెక్కలు చూపించడం సహజం అనేది జగమెరగిన సత్యం. ఇక ప్రత్యేకహోదా కోసం ఇప్పటికే పవన్‌కళ్యాణ్, శివాజీ, రోజా, మురళీమోహన్ నుంచి సంపూర్ణేష్ బాబు వరకు జైలుకు వెళ్లారని, దానిని టిడిపి నాయకులు గుర్తుపెట్టుకోవాలని, టిడిపి అధికార ప్రతినిధులం అని చెప్పుకునే వారు నేడు టివీలలో సినీ ఇండస్ట్రీపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారని, వీరిని అదుపులో పెట్టి, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబు నిరోధించాలని, లేకపోతే అది చంద్రబాబుకే నష్టమని తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డాడు. ఇక టిడిపిలో ఉంటూ, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తోడల్లుడు, లోకేష్‌కి మామ అయిన టాప్‌హీరో బాలకృష్ణ ఇప్పటి వరకు ప్రత్యేకహోదాపై నోరు విప్పని విషయం చంద్రబాబు, లోకేష్, బాబూ రాజేంద్రప్రసాద్‌లకు తెలియదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఇది కూడా నిజమే కదా....!