ఈశాన్య రాష్ట్రాలలో కూడా పాగా వేశాం అనే ఉత్సాహంలో ఉన్న బిజెపి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడాలని, చంద్రబాబుని వీక్ చేయాలని ప్రయత్నిస్తోందన్న మాట వాస్తవం. నిజానికి చంద్రబాబుకి అర్ధమైందో లేదో గానీ ఏపీ నుంచి వెంకయ్యనాయుడు ద్వారా వచ్చే ఒత్తిడి, చంద్రబాబుతో వెంకయ్యలకు ఉన్న సత్సంబంధాల కారణంగానే వెంకయ్య అడ్డు లేకుండా చేయడానికే ఆయనకి ఉప రాష్ట్రపతి పదవిని ఇచ్చి బిజెపి, మోదీ, అమిత్‌షాలు చూచాయగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలపై సంకేతాలు ఇచ్చారు. కానీ దానిని చంద్రబాబు, టిడిపి నాయకులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇక వెంకయ్యకి అన్నింటి కంటే పార్టీ ముఖ్యం. వెంకయ్యతో పోల్చుకుంటే మోదీ, అమిత్‌షాలు చాలా జూనియర్లు. నాడు అద్వానీకి సభలో మంచినీరు తెచ్చి ఇచ్చిన వ్యక్తి మోదీ. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుంటే వెనకవైపు చేతులు కట్టుకుని ఓ సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తి మోదీ. ఇక తాజాగా అద్వానీని అవమానించడం కూడా బిజెపి వారికే కాదు.. వెంకయ్యకి కూడా బాధ కలిగించిందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఉపరాష్ట్రపతి కావడంతో వెంకయ్య రాజకీయాలలో వేలు పెట్టలేకపోతున్నాడు. కానీ తాజాగా ఆయన మానవవనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్, ఎంపీ హరిబాబు, సుజనాచౌదరిలను పిలిపించి ఏపీలో సెంట్రల్, గిరిజన విశ్వవిద్యాలయాలను వెంటనే ఏర్పాటు చేయాలని, భవనాలు లేవు.. నిధులు లేవని తాత్సారం చేయవద్దని వచ్చే ఏడాది నుంచి ఈ సంస్థలు అందుబాటులోకి రావాలని సూచించాడు. దీనిపై అమిత్‌షా మండిపడుతున్నాడు. మంత్రులు, ఎంపీలతో వెంకయ్యకి ఏమి పని అని మోదీకి ఫిర్యాదు కూడా చేశాడట. ఇంత మాత్రాన వెంకయ్య ఏపీకి చెందిన ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకుంటాడని భావించలేం. ఆయనకు ఈ విషయాలలో జోక్యం చేసుకోవద్దని మోదీ కూడా సంకేతాలు పంపించాడని అంటున్నారు. ఇక వెంకయ్యకి మొదట బిజెపి పార్టీనే తల్లిలాంటిది. ఆయన తనకు పార్టీ తర్వాతనే అన్ని అని ఏన్నోసార్లు చెప్పాడు. దీనిని బట్టి చంద్రబాబుకి, ఏపీకి ఇంతకు మించి వెంకయ్య ఏమి చేయలేడని, ఆయన నుంచి ఎక్కువ ఆశించడం కూడా వృధానే అని అర్ధమవుతోంది.