'పిల్లజమీందార్'తో మెప్పించినా కూడా ఆ తర్వాత రొటీన్ స్టోరీలు తీసి దర్శకుడు జి.అశోక్ దెబ్బతిన్నాడు. కానీ ఎట్టకేలకు అనుష్క,యువి క్రియేషన్స్ పుణ్యమా అని 'భాగమతి'తో ఈ ఏడాది తొలి హిట్‌ని అందించాడు. ఇక ఇప్పుడు పలువురు హీరోలు విభిన్న చిత్రాలు చేయాలని ఉత్సాహపడుతున్నారు. రొటీన్, మాస్, యాక్షన్ చిత్రాలను కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాలు చేయడానికి స్టార్స్ సైతం ముందుకు వస్తున్నారు. అదే కోవలో నడవడానికి జి.అశోక్ సిద్దమయ్యాడు. రొటీన్ చిత్రాల కంటే తాను వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారానే హిట్‌ని అందుకోవడం జరుగుతుండటంతో 1914కి సంబంధించిన ఓ పీరియాడికల్ మూవీ సబ్జెక్ట్‌పై ఆయన కసరత్తు చేస్తున్నాడని సమాచారం.
'కోమగటమరు' అనే జపనీస్ స్టీమ్ షిప్ ఓ బ్రిటిష్‌రాజు ఆధీనంలో ఉండేది. ఆ షిప్‌లో మన భారతీయులు బానిసలుగా ఉండేవారు. 1914లో ఈ షిప్ ద్వారా ఆ రాజు కెనడాలోకి ప్రవేశించాలనే ప్రయత్నం విఫలమవుతుంది. ఇలా యదార్ధ సంఘటన ద్వారా ఈ చిత్రం సబ్జెక్ట్‌ని అశోక్ రూపొందిస్తున్నాడు. ఇక సంకల్ప్‌రెడ్డి అనే దర్శకుడు సబ్‌మెరైన్ నేపధ్యంలో 'ఘాజీ' చిత్రం తీసి మెప్పించాడు. ప్రస్తుతం ఆయన వరుణ్‌తేజ్‌తో వ్యోమగాముల నేపధ్యంలో మరో చిత్రం తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ట్రావెన్ కోర్ రాజవంశీయుల నేపద్యంలో రానా హీరోగా మరో చిత్రం కూడా రూపొందుతోంది. మరి అశోక్ చిత్రం 'భాగమతి'లా మూడు భాషల్లో క్రేజ్ తెచ్చుకోవాలంటే బహుభాషల్లో క్రేజ్ ఉన్న హీరో అయితేనే బాగుంటుందని భావిస్తున్నాడట.